మరి రాహుల్ గాంధీ ఎందుకు వస్తునట్లు?

May 24, 2017


img

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేను రాష్ట్రంలో మా పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించేందుకు మా పార్టీ నేతలు, కార్యకర్తలకు మార్గదర్శకం చేయడానికే వచ్చాను,” అని అమిత్ షా విస్పష్టంగా చెపుతున్నప్పుడు, ఆయన అధికార దాహంతోనే రాష్ట్రంలో పర్యటిస్తున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

జూన్ 1వ తేదీన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అదే పని మీద రాష్ట్రానికి వస్తున్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. దానిలో ఆయన ఏమి మాట్లాడుతారో ఊహించవచ్చు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి ఇస్తే కేసీఆర్ దానిని అన్ని విధాల భ్రష్టు పట్టించారని, కనుక రాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నేరవేర్చిన కాంగ్రెస్ పార్టీకే వచ్చే ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించాలని రాహుల్ గాంధీ కోరవచ్చు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉండగానే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నప్పుడు, అమిత్ షా అధికార దాహంతో తెలంగాణాలో పర్యటిస్తున్నారని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. భాజపాతో సహా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప ఎల్లకాలం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షంలో కూర్చోవాలనుకాదు కదా! కనుక అమిత్ షా పర్యటనను తప్పు పట్టడం సమంజసం కాదు. 


Related Post