ప్రస్తుతం నల్గొండలో పర్యటిస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు బారీగా నిధులు అందజేస్తున్నా వాటిని తెరాస సర్కార్ సరిగ్గా వినియోగించకపోవడం వలన గ్రామస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలవడంలేదని అమిత్ షా విమర్శించారు.
ఊహించినట్లుగానే తెరాస ఆయనకు చాలా ధీటుగా బదులిచ్చింది. తెరాస ఎమ్మెల్యే కే. ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేకమంది కేంద్రమంత్రులు తెలంగాణా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మెచ్చుకొంటుంటారు. కానీ అమిత్ షా రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని, సంక్షేమ పధకాలు అమలుకావడం లేదని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఒకే పార్టీలో నేతలు పరస్పరం ఇంత విరుద్దంగా మాట్లాడుతున్నారంటే వారి మద్య సరైన అవగాహన లేదని అర్ధం అవుతోంది.
అసలు అమిత్ షాకు తెలంగాణా రాష్ట్ర చరిత్ర గురించి, రాష్ట్ర సమస్యల గురించి ఏమి తెలుసని మాట్లాడుతున్నారు? రాష్ట్ర భాజపా నేతలు చెప్పిన మాటలనే ఆయన చిలకలా వల్లిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అమిత్ షా చెపుతున్నారు. కానీ ఆ ఎన్నికలలో పోటీ చేసేందుకు భాజపాలో అంతమంది అభ్యర్దులున్నారా లేదా ఆయనకు తెలుసా?
మా పార్టీ ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలుచేస్తూ తన నిజాయితీని చాటుకొంటోంది. కానీ మూడేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు హైకోర్టు విభజన జరుగలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు హామీలను మోడీ సర్కార్ అసలు పట్టించుకోవడమే లేదు. అసలు ఈ మూడేళ్ళలో రాష్ట్రానికి ఏమి చేసిందని ప్రజలు భాజపాకు ఓటేస్తారు? ఏపికి బారీగా నిధులు అందిస్తున్న మోడీ సర్కార్ తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. మా ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కనీసం భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రలలోనైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?అని పరిశీలించి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది,” అని అన్నారు.
రాష్ట్ర భాజపా నేతలు, అమిత్ షా ఆరోపిస్తున్నట్లు తెలంగాణాలో అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుకాకపోతుంటే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ చైర్మన్, అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెరాస సర్కార్ ను మెచ్చుకొని ఉండరు. కానీ మెచ్చుకొంటున్నారంటే రాష్ట్ర భాజపా నేతలు, అమిత్ షా చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమైనవని అర్ధం అవుతోంది. కనుక అవి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న నిరాధారమైన ఆరోపణలుగానే భావించవలసి ఉంటుంది. అయినా తెరాస నేతలు అడిగిన ఈ ప్రశ్నలకు రాష్ట్ర భాజపా నేతలు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగితే చాలు..ఎన్ని కలలైన కనవచ్చు.