తెలంగాణా రాష్ట్రంపై డిల్లీ నేతల దండయాత్రలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం అయ్యారా? అంటే అవుననే భావించవలసి ఉంటుంది. డిల్లీ నుంచి బాదుషాలు వచ్చినా..బాహుబలిలు వచ్చినా తెరాసకు వచ్చే నష్టం ఏమీ లేదని ఎంపి కవిత అన్నప్పటికీ, అమిత్ షా, రాహుల్ గాంధీల తెలంగాణా పర్యటనలు..వాటి కోసం రాష్ట్ర భాజపా, కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న హడావుడిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయినట్లే ఉన్నారు. బహుశః అందుకే మే27న తెలంగాణా భవన్ లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు.
సాధారణంగా పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటరీ సమావేశం, శాసనసభ సమావేశాలకు ముందు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు పార్లమెంటు, శాసనసభ సమావేశాలు లేకపోయినా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కాబోతుండటంతో దానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.
ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించి రాష్ట్రంలో బలపడాలనే భాజపా ఆలోచనలు, తెరాస, భాజపాలను డ్డీ కొనేందుకు అవసరమైతే తెదేపాతో సహా ఏ పార్టీతో అయినా కలిపి పనిచేయాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు తెరాసకు కొంత ఆందోళన కలిగించే విషయాలే. ముఖ్యంగా ఇక నుంచి తెలంగాణా రాష్ట్రంపైనే దృష్టి పెడతానని అమిత్ షా చెప్పిన మాటను కేసీఆర్ సీరియస్ గానే తీసుకొని ఉండవచ్చు. ఉత్తరాది రాష్ట్రాలలో భాజపాకు వరుస విజయాలు సాధించిపెట్టిన అమిత్ షా వంటి రాజకీయ ఉద్దండుడు తెలంగాణాలో భాజపాని గెలిపించుకొంటానని ప్రకటించి పావులు కదుపుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకోరు కనుకనే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలను నిలువరించడానికి తగిన వ్యూహాలు, కార్యాచరణ పధకాన్ని ఈ సమావేశంలో రూపొందించుకొనే ప్రయత్నం చేయవచ్చు. అది కాక జూన్ 2నరాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా దగ్గర పడుతున్నందున దాని ఏర్పాట్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించవచ్చు.