‘వచ్చే ఎన్నికలలో తెరాస, భాజపాలను వ్యతిరేకించే తెదేపాతో సహా ఏ పార్టీతోనయినా కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోవడానికి సిద్దం’ అని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించి మూడు రోజులు కూడా కాలేదు. ఈరోజు టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దానికి సానుకూలంగా స్పందించడం విశేషం. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయ పార్టీలు ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవడం చాలా సహజం. మేము కూడా వాటికి అతీతులం కాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకోవడానికి మేము సిద్దమే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెలిబుచ్చుతున్న అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను,” అని అన్నారు.
ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ పొత్తులకు అనుకూలమేనని ఒకరికొకరు సంకేతాలు ఇచ్చిపుచ్చుకోవడం బాగానే ఉంది. కానీ వారి నిర్ణయాలను వారి అధిష్టానాలు, పార్టీలో ఇతర నేతలు అంగీకరిస్తారా? అంగీకరించకపోతే కాంగ్రెస్, తెదేపాల మద్య పొత్తులు ఎలా సాధ్యం? ఒకవేళ అంగీకరిస్తే, పొరుగునే ఉన్న ఆంధ్రాలో కత్తులు నూరుకొంటూ తెలంగాణాలో చేతులు కలుపుకొని సాగడం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలకు వారే జవాబులు చెప్పాల్సి ఉంటుంది.