ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఊహించని సమస్యలు ఎదుర్కోవలసివస్తోందిపుడు. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో సీనియర్ వైకాపా నేతను, అతని అనుచరుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారికాచి వేట కొడవళ్ళతో నరికి చంపారు. ఆయనను ఏపి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తే హత్య చేయించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
వైకాపాలో బలమైన నేతలను నయాన్నో భయన్నో తెదేపాలోకి రప్పించుకోవాలనుకొన్న చంద్రబాబు నాయుడు అది కుదరకపోవడం తన పార్టీకి నష్టం కలిగిస్తారనుకొన్న తన ప్రత్యర్ధులను ఈవిధంగా హత్యలు చేయించి అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అని, ఆయన డైరెక్షన్ లోనే కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయించారని జగన్ ఆరోపిస్తున్నారు. వారిరువురిపై గవర్నర్ నరసింహన్ కు పిర్యాదు చేశారు. వారిరువురినీ తక్షణం అరెస్ట్ చేసి సిబిఐ విచారణ జరిపించాలని జగన్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్య సరిపోదన్నట్లుగా వైకాపా నుంచి తెదేపాలో చేరిన గొట్టిపాటి రవికి, సీనియర్ తెదేపా నేత కరణం బలరాం వర్గానికి మద్య గొడవలు పతాక స్థాయికి చేరాయి. మూడు రోజుల క్రితం కరణం అనుచరులు గొట్టిపాటి వర్గానికి చెందిన ఇద్దరిని దారికాచి వేట కొడవళ్ళతో అతికిరాతకం హత్య చేశారు. ఆ హత్యలతో తనకు సంబంధం లేదని గొట్టిపాటి రవి వాదిస్తున్నారు.
ఈరోజు ఆయన ప్రకాశం జిల్లా తెదేపా అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమానికి వచ్చినప్పుడు అక్కడే ఉన్న కరణం బలరాం ఆయన అనుచరులు వారిని అడ్డుకొన్నారు. గొట్టిపాటి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య తోపులాటలు జరిగాయి. ఆ సమయంలో మంత్రులు పరిటాల సునీత, పి నారాయణ తదితరులు అక్కడే ఉన్నారు. కానీ వారిని ఇరువర్గాలు పట్టించుకోకుండా ఘర్షణ పడ్డారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం చెందిన సిఎం చంద్రబాబు గొట్టిపాటి రవిని తక్షణమే అమరావతికి రమ్మని ఆదేశించడంతో అయన కొద్దిసేపటి క్రితమే ఒంగోలు నుంచి బయలుదేరారు.
ఈ రెండు సంఘటనలతో పార్టీ పరువు, తెదేపా సర్కార్ పరువు కూడా దెబ్బ తింటోంది. రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు, హత్యలు మొదలయ్యాయని ప్రతిపక్షాలు, మీడియా కోడై కూస్తుండటం చంద్రబాబు నాయుడుకు చాలా ఆందోళన కలిగించే విషయమే.