తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “పెరేడ్ గ్రౌండ్స్ లో సచివాలయం నిర్మాణాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ తెరాస సర్కార్ అక్కడే సచివాలయం నిర్మించాలనుకొంటే మేము తప్పకుండా దానిని అడ్డుకొంటాము,” అని చెప్పారు.
అలాగే తాజాగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన భూసేకరణ చట్టం కూడా తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. దానిపై కూడా త్వరలో కోర్టుకు వెళ్ళబోతున్నట్లు ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు.
ఈ రెండు అంశాలపై టీ-కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉంది. ఆ కారణంగానే ఇంతవరకు వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనులు పూర్తి కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి లేదా నత్తనడకన సాగుతున్నాయి. ఈ కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తెలంగాణా ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ కొత్త చట్టంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు కనుక కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఆ చట్టాన్నే కోర్టులో సవాలు చేయడానికి సిద్దం అవుతోంది. భూసేకరణలో నిర్వాసిత రైతులకు అన్యాయం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన భాద్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని గుర్తిస్తే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాడవచ్చు. కానీ నిర్వాసితుల కోసం కాక నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భూసేకరణకు, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నట్లయితే, వచ్చే ఎన్నికలలో దానికి వారే మూల్యం చెల్లించవలసి వస్తుందని మరిచిపోకూడదు.