కాళేశ్వరం ప్రాజెక్టుపై భిన్న వాదనలు

May 23, 2017


img

తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది ఉత్తర తెలంగాణా జిల్లాలకు వరప్రదాయిని అని తెరాస సర్కార్ చెపుతుంటే, దానిలో మల్లన్నసాగర్ జలాశయానికి ఎత్తిపోతల పధకం ద్వారా నీటిని తరలించడం ఆర్ధికంగా పెనుభారం అవుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా యావత్ కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని, కనుక ప్రభుత్వం దీని నుంచి మల్లన్నసాగర్ కు నీటిని తరలించాలనే ఆలోచన విరమించుకొంటే మంచిదని ప్రొఫెసర్ కోదండరామ్ సూచిస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి మల్లనసాగర్ మార్గంలో 3 అడుగుల వ్యాసంతో 81కిమీ పొడవు గల ఒక సొరంగం తవ్వుతున్నారు. ఇది ఆసియాలో కెల్లా అతి పొడవైన సొరంగం. అది దాదాపు పూర్తికావస్తోంది. దాని గోడలు కూలిపోకుండా ఇంకా సిమెంట్ లైనింగ్ పనులు చేయవలసి ఉంది. ఇవ్వన్నీ భారీ ఖర్చుతో కూడుకొన్నవే. కనుక అవన్నీ కలిపి చూసుకొంటే ఒక ఎకరానికి నీళ్ళు అందించేందుకు ప్రభుత్వానికి ఎంత ఖర్చుపెడుతోంది? దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా రాదా? అని కాంగ్రెస్ నేతలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఒక ప్రాంతానికి శాశ్విత ప్రాతిపదికన సాగు,త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదని తెరాస సర్కార్ వాదన. అనేక దశాబ్దాలుగా తీవ్ర నీటి ఎద్దడితో బాధలు పడుతున్న ఉత్తర తెలంగాణా జిల్లావాసులకు నీళ్ళు అందించేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్పష్టంగా చెపుతున్నారు.   

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కాలువలు, బ్యారేజీలు, ఇన్-టేక్ వెల్స్, పంప్ హౌసులు, వాటికి విద్యుత్ సబ్-స్టేషన్లు వగైరాల నిర్మాణపనులను తెరాస సర్కార్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది. డిశంబర్ 2018కల్లా అన్ని పనులు పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణా జిల్లాలకు నీళ్ళు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరి వాదన సరైనదో కాలమే సమాధానం చెపుతుంది. 


Related Post