భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై టీ-కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రశాంతంగా ఉన్న తెలంగాణా రాష్ట్రంలో ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టి భాజపాను అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన రజాకర్ల దాడిలో చనిపోయినవారి కుటుంబాలను ఇప్పుడు పరామర్శిస్తున్నారు. ఆవిధంగా ప్రజలను మతప్రాతిపదికన చీల్చి వచ్చే ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను మతాలవారీగా చీల్చాలనుకోవడం చాలా దారుణమైన ఆలోచన. మా పార్టీ ఇటువంటి చర్యలను గట్టిగా ఖండిస్తుంది,” అని అన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణా రాష్ట్రంలో ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, హైకోర్టు విభజన చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ మూడేళ్ళయినా వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుచేయకుండా, రాష్ట్రంలో మిర్చిరైతులు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకొంటుంటే వారిని ఆదుకొనే ప్రయత్నం చేయకుండా తెలంగాణాలో అధికారంలోకి రావాలని కలలుకంటూ రాష్ట్ర పర్యటనకు రావడమే కాక మళ్ళీ ప్రజల మద్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు హామీలను అమలుచేయనందుకు అమిత్ షా ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి,” అని ఉత్తం కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికలలో తెరాస-భాజపాల మద్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో హటాత్తుగా భాజపా కూడా బలం పుంజుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టినందునే తెరాస కంటే ముందుగా టీ-కాంగ్రెస్ అమిత్ షా విమర్శిస్తోందని చెప్పవచ్చు. భాజపా చేస్తున్న ప్రయత్నాల వలన తెరాసకు కూడా నష్టం కలిగే అవకాశాలున్నాయి కనుక అది కూడా నేడో రేపో అమిత్ షా రాష్ట్ర పర్యటనపై ఇదే విధంగా ఘాటుగా స్పందించవచ్చు.