తెదేపా పెద్దల పీఠాలు కదిలిపోనున్నాయి: భాజపా

May 22, 2017


img

తెలంగాణాలో తెదేపా-భాజపాలు క్రమంగా దూరంగా జరిగినప్పటికీ ఆంధ్రాలో ఇంకా ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. అది కలహాల కాపురమే అయినప్పటికీ జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీల మద్య మంచి అవగాహన, సంబంధాలు ఉండటంతో ఇంకా ఏపిలో వాటి కాపురం సాగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటి నుంచి తెదేపా నేతలు కేంద్రప్రభుత్వం, భాజపాల మీద గుర్రుగా ఉన్నారు. 

తెదేపా ఎంపి కేశినేని నాని విజయవాడలో నిన్న తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “2014 ఎన్నికలలో మనం భాజపాతో కలవడం వలననే నాకు ఆశించినంత మెజారిటీ రాలేదు. లేకుంటే కనీసం 1.60 లక్షల మెజార్టీ వచ్చి ఉండేది. వచ్చే ఎన్నికలలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ సీటును బారీ మెజార్టీతో గెలిచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇద్దాం,” అని అన్నారు.  

మూడేళ్ళ క్రితం జరిగిపోయిన ఎన్నిక గురించి కేశినేని నాని ఇప్పుడు మాట్లాడటం అనవసరమే. కానీ ఎందుకు మాట్లాడారు? అంటే రాష్ట్రంలో తెదేపాకు ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలని కలలుకంటున్న భాజపాకు తన స్థాయి ఏమిటో చెప్పడానికేనని భావించవచ్చు. 

భాజపా నేత (మాజీ కాంగ్రెస్ నేత) కన్నా లక్ష్మి నారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలను మేము ఖండిస్తున్నాము. హత్యా రాజకీయాలకు మా పార్టీ వ్యతిరేకం. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతోంది. దానిని అరికట్టేందుకు తెదేపా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. త్వరలోనే రాష్ట్రంలోని కొందరు పెద్దల అధికార పీఠాలు కదిలిపోబోతున్నాయి,” అని అన్నారు. 

 జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తరువాతే భాజపా నేతలు ఈవిధంగా మాట్లాడటం గమనిస్తే, అతనితో భాజపా చేతులు కలుపబోతోందనే తెదేపా అనుమానాలు, భయాలు నిజమేననే భావన కలుగుతోంది. కనుక వచ్చే ఎన్నికల వరకు అవి కలిసే ముందుకు సాగుతాయా లేదా? అనేది మెల్లమెల్లగా బయటపడవచ్చు.   


Related Post