రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకొనేందుకు హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గంలో ప్రభుత్వ భూములను టి.ఎస్.ఐ.ఐ.సి. ద్వారా వేలం వేయగా అనూహ్యమైన ధరలు వచ్చాయి. మే10న ఆన్ లైన్ ద్వారా టెండర్లు స్వీకరించి వాటిని శుక్రవారం తెరిచారు.
వాటిలో రాయదుర్గంలోని 2.84 ఎకరాల భూమిలో గజం కనీస ధర రూ.80,000గా నిర్ణయించగా రూ.88,000 పలికింది. అంటే ఎకరానికి రూ. 42.59కోట్లు పలికిందన్న మాట! గత ఏడాది ఇదే ప్రాంతంలో భూములకు ప్రభుత్వం నిర్వహించిన వేలంపాటలో ఎకరానికి రూ.29 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ లెక్కన ఈసారి ఎకరానికి రూ.13.59 కోట్లు పెరిగింది. రాయదుర్గంలోనే మరో ప్రాంతంలో 2.15 ఎకరాలలో ఎకరానికి రూ.29.33 కోట్లు ధర పలికింది.
మొత్తం ఐదు లాట్లలో భూములను ప్రభుత్వం వేలానికి పెట్టగా కేవలం రెండు లాట్లలో భూములకే టెండర్లు దాఖలయ్యాయి. మిగిలిన మూడు లాట్లకు ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడం విశేషం. ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వం రూ.500-600 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని భావించింది. భూములకు అనూహ్యమైన ధరలు వచ్చినప్పటికీ మిగిలిన మూడు లాట్లలో భూములు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.185కోట్లు ఆదాయం మాత్రమే సమకూరే అవకాశం కనబడుతోంది. ఇంకా టెండర్లు ఎవరికీ ఖరారు చేయలేదు కనుక ఈ వేలంలో పాల్గొన్న పోటీదారుల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు.
ప్రభుత్వం ఆశించిన దాని కంటే భూములకు చాలా ఎక్కువ ధరలే పలికినందుకు సంతోషించాలో లేక ఏడాదికి రూ.13.59 కోట్లు చొప్పున ధరలు పెరుగుతున్న విలువైన ప్రభుత్వ భూములను తాత్కాలిక అవసరాల కోసం అమ్మేసుకొంటునందుకు బాధపడాలో తెలియడం లేదు. ప్రభుత్వమైనా, సామాన్య ప్రజలైన ఆస్తులను అమ్ముకోవడం చాలా తేలికే. కానీ వాటిని సంపాదించడానికి ఒక జీవితకాలం సరిపోదని అందరికీ తెలుసు. భవిష్యత్ ప్రభుత్వ అవసరాల కోసం అటువంటి విలువైన భూములను కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా, తాత్కాలిక అవసరాల కోసం అమ్మేసుకొని సొమ్ము చేసుకోవాలనుకోవడం దురదృష్టకరం. తెలంగాణా ధనిక రాష్ట్రమని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బలంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పదేపదే చెపుతున్నప్పుడు మళ్ళీ ఆదాయం సమకూర్చుకోవడం కోసం భూములు అమ్మవలసిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పాలి.