రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో తెదేపా ఎప్పుడో ఉనికి కోల్పోయింది. ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం మానేసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెరాస రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతలలో ఏమీ చూపలేకపోతున్నారు. కనుక రాష్ట్రంలో తెరాసకు భాజపాయే ఏకైక ప్రత్యామ్నాయం. కేంద్రంలో మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోంది. కనుక రాష్ట్ర ప్రజలు భాజపా వైపే చూస్తున్నారిపుడు. వచ్చే ఎన్నికలలో తెరాస సర్కార్ మీద మేము మోడీ అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నాము. అది అణుబాంబు కంటే శక్తివంతమైనది,” అని అన్నారు.
గత ఎన్నికలలో కూడా మోడీ వచ్చి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉన్నందున మోడీ ప్రభావం పనిచేయలేదు. కానీ కారణాలు ఏవైతేనేమి, మూడేళ్ళ క్రితం తెరాసకు కనిపించిన పూర్తి సానుకూల పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పక తప్పదు.
కాంగ్రెస్, భాజపా, తెదేపాలను పక్కన పెట్టినా, ఆనాడు తెలంగాణా కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు సైతం తెరాస సర్కార్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మూడేళ్ళ నుంచి తెరాస సర్కార్ పాలనను ప్రజలు కూడా కళ్ళార చూస్తున్నారు కనుక దాని మంచి చెడ్డలు వరు కూడా స్వయంగా బేరీజు వేసుకొంటున్నారు. కనుక గత ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఎన్నికలలో తెరాసకు అంత అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చని భావించవచ్చు. అందుకే కాంగ్రెస్, భాజపాలు తెలంగాణాపై అన్ని ఆశలు పెట్టుకొన్నాయని చెప్పవచ్చు.
కానీ మిగిలిన ఈ రెండేళ్ళలో తెరాస సర్కార్ తన నియంతృత్వ వైఖరిని సడలించుకొని, ప్రజలను మెప్పించగల అభివృద్ధి సంక్షేమ పనులు ఏమైనా చేసి చూపినట్లయితే, ప్రజలు దానివైపే మొగ్గు చూపవచ్చు. అయితే మిగిలిన రెండేళ్లలో తెరాస పనితీరు ఏవిధంగా ఉన్నపటికీ భాజపా ‘బ్రహ్మాస్త్రం’ తెలంగాణాలో పనిచేయకపోవచ్చు. భాజపాకు కావలసింది ‘బ్రహ్మాస్త్రం’ కాదు తెరాసను, కేసీఆర్, కుటుంబ సభ్యులను డ్డీ కొనగల బలమైన నేతలు. ఇంకా చెప్పాలంటే వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా అవసరమే. కనుక భాజపా ముందుగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.