రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉందిపుడు. అధికారంలో ఉన్న తెరాస ‘ఆల్ ఈజ్ వెల్’ అని పాట పాడుతోంది. ప్రతిపక్షాలేమో ‘ఎవ్రీ థింగ్ ఈజ్ రాంగ్’ అని పాడుతుంటే, ప్రొఫెసర్ కొదండరామ్ వారికి కోరస్ గా అసంతృప్తి రాగం తీస్తున్నారు.
ఇక రాష్ట్రరాజకీయాలలో ద్వితీయస్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు భాజపా కూడా పోటీకి వస్తోంది. ఆ రెండు పార్టీలు ‘వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తామంటే..కాదు మేమే వస్తామని’ జబ్బలు చరుచుకొంటున్నాయి.
వాటి హడావుడి చూసి తెరాస నేతలు లోలోన కొంచెం కంగారు పడుతున్నా పైకి మాత్రం వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ మేమే గెలిచి అధికారంలోకి వస్తామని గట్టిగా వాదిస్తున్నారు. ‘మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలు అందరూ ఫ్లాట్ అయిపోతున్నారు. కనుక వారందరూ మావైపే ఉన్నారని’ తెరాస నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు. వామపక్షాల నేతలు కూడా ఏదో ఆశతో హడావుడిగా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేసేస్తున్నారు.
ఇక మరో విచిత్రమైన పరిణామం ఏమిటంటే కొన్ని ప్రజాసమస్యలపై బద్ధ శత్రువులైన ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయి. అయితే వాటి ఐఖ్యత అంత వరకే పరిమితం. తరువాత ఎవరి కార్యాలయాలు వారు చేరుకోగానే, మళ్ళీ యధాప్రకారం ఒకరినినొకరు తీవ్రంగా విమర్శించుకొంటారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను, మోడీని నమ్మడం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తుంటే, రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్, భాజపా, తెదేపాలను ప్రజలు నమ్మడం లేదని తెరాస నేతలు, అలాగే కాంగ్రెస్, తెరాసలను ప్రజలు నమ్మడం లేదని భాజపా నేతలు వాదించుకొంటారు. అన్ని పార్టీలు కూడా ప్రజలందరూ తమవైపే ఉన్నారని బల్లగుద్ది వాదించుకొంటున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ తాము బాగానే పనిచేస్తున్నాము కనుక మళ్ళీ మళ్ళీ ప్రజలు తమనే ఎన్నుకొంటారని చెప్పుకోవడం సహజమే. కానీ ఈసారి ప్రతిపక్షాలు కూడా తామే గెలుస్తామని ఇంత నమ్మకంగా ఉండటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ అప్రజాస్వామిక పోకడలు 2. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉండటం.
కేసీఆర్ నియంతృత్వం, అప్రజాస్వామిక పోకడల విషయంలో బహుశః ప్రజలకు కూడా భినాభిప్రాయలు లేకపోవచ్చు. కానీ రాష్ట్రంలో తెరాసను డ్డీ కొనగల పార్టీ ఏదీ లేదని ప్రతిపక్షాలు గ్రహించినందునే అవి రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని భావిస్తున్నట్లున్నాయి. కనుకనే తెరాసకు తామే ఏకైక ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్, భాజపాలు చెప్పుకొంటూ రాష్ట్ర రాజకీయాలలో రెండవ స్థానం కోసం పోటీలు పడుతున్నాయని చెప్పవచ్చు. ఇంతకీ రాష్ట్ర ప్రజలు ఎవరు వైపున్నారో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడవలసిందే.