రాష్ట్రంలో సిటీ, రూట్ బస్సులలో ఎక్కడ చూసినా కనీసం నిలబడేందుకు కూడా ఖాళీ ఉండదు. అంతమంది జనం ఎక్కుతుంటారు. అయినా ఆర్టీసీకి ఏటా వేల కోట్లు నష్టాలే! ఆర్టీసీ బస్సులు నిత్యం రద్దీగా తిరుగుతున్నప్పుడు ఆర్టీసీకి ఎప్పుడూ నష్టాలే వస్తాయో ఎవరికీ తెలియదు.
ఆర్టీసీలో చాలా అనుభవం ఉన్న అనేకమంది అధికారులు ఉన్నా ఈ సమస్యకు వారెవరూ పరిష్కారం కనుగొనలేకపోవడంతో చివరికి ఆ బాధ్యత కూడా ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకోవలసి వచ్చింది. గత ఏడాది జూన్ లో ఆర్టీసి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆర్టీసి లాభాల బాట పట్టేందుకు కేసీఆర్ ఎన్నో చక్కటి ఉపాయాలు చెప్పారు.
ప్రయాణికులను బట్టి, వారి అవసరాలను బట్టి బస్సులు నడపాలని కేసీఆర్ చెప్పారు. అవసరం లేని రూట్లలో పెద్ద బస్సులను నడపడం కంటే మినీ బస్సులను నడిపితే ఖర్చు తగ్గించుకోవచ్చని చెప్పారు. ఎక్కువ రద్దీ డిమాండ్ ఉన్న రూట్లలో మరిన్ని పెద్ద బస్సులు, తక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో మినీ బస్సులు నడిపితే నష్టాలు తగ్గించుకోవచ్చని చెప్పారు. దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులు బస్టాండ్ల వద్ద పడిగాపులు కాసే పద్దతికి స్వస్తి చెప్పి బస్సులే ప్రయాణికుల బస్తీల వద్దకు వెళ్ళి పికప్ చేసుకొంటే బాగుంటుందని చెప్పారు. రూట్ బస్సులలో కండక్టర్ లేకుండా డ్రైవరే టికెట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తే కొంతమేర భారం తగ్గుతుందని చెప్పారు. కేసీఆర్ ఇటువంటివే ఇంకా అనేక మంచి సూచనలు చేశారు.
ఆర్టీసీని నష్టాల బారి నుంచి బయటపడేయడానికి కేసీఆర్ ఇన్ని ఉపాయాలు చెపితే ఆర్టీసీ అధికారులు “తాళం వేసితిని కానీ గొళ్ళెం మరిచితిని” అని అన్నట్లు వ్యవహరిస్తుండటం విశేషం.
కేసీఆర్ చెప్పినట్లే ఆర్టీసి వజ్ర పేరుతో మినీ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ మద్య ఈ వజ్ర బస్సులను నడిపిస్తున్నారు. అవి నేరుగా బస్తీలకే వెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకొని తీసుకువెళ్ళాలి. అలాగే చేస్తున్నాయి కూడా. కానీ వాటిలో ప్రయానిస్తున్నది ఒకరు ఇద్దరూ ప్రయాణికులను మాత్రమే. దానికి కారణం ఆ బస్సులలో టికెట్లు ఇచ్చే కండెక్టర్ ఉండరు. డ్రైవర్ టికెట్స్ ఇవ్వడు. బయట టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ ఎక్కడా లేవు. కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఆ బస్సు టికెట్స్ బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆ సంగతి చాలా మందికి తెలియదు. తెలిసినా ఆ మొబైల్ యాప్ వినియోగించుకోవడం చాలా మందికి చేత కాదు. కనుక ఆ బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నా ఎవరినీ ఎక్కించుకోలేని పరిస్థితి. దీంతో వజ్ర బస్సులు ఖాళీగా పరుగులు పెడుతున్నాయి. కనుక ప్రయాణికులు మళ్ళీ యధాప్రకారం బస్సుల కోసం బస్టాండ్ కు వెళ్ళి పడిగాపులుకాయక తప్పడం లేదు. నష్టాలు తగ్గించుకోవడానికి కేసీఆర్ ఒక ఉపాయం చెపితే కనీసం దానినైనా అధికారులు సరిగ్గా అమలు చేయలేక పోవడాన్ని ఏమనుకోవాలి? ఇంత చిన్న సమస్యను కూడా ముఖ్యమంత్రి కేసీఆరే పరిష్కరించాలా లేక అధికారులు పరిష్కరిస్తారో చూద్దాం.