తెరాస ఆధిపత్యధోరణి మానుకోవాలి

May 18, 2017


img

నల్లగొండ జిల్లా కేంద్రంలో బొత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి ఖండించారు. అధికారంలో ఉన్నవారే ఇలాగ ప్రతిపక్ష నేతలపై భౌతికదాడులు చేయడం తగదని అన్నారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించకపోయినా కనీసం స్పందించకపోవడాన్ని జానారెడ్డి తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు చోటులేదని అన్నారు. తమను ప్రశ్నిస్తున్న వారిపై తెరాస సర్కార్ ఇలాగే భౌతికదాడులకు పాల్పడుతుంటే ప్రజలే తిరగబడి ఎదురుదాడి చేస్తారని జానారెడ్డి హెచ్చరించారు. తెరాస సర్కార్ తన నిరంకుశ, ఆధిపత్య ధోరణిని తక్షణం మార్చుకొని ప్రజాస్వామ్య విధానాలు అలవాటు చేసుకోవాలని జానారెడ్డి హితవు పలికారు. 

ఆ రోజు జరిగిన ఈ సంఘటనలో ఇరుపక్షాలది తప్పుందని చెప్పక తప్పదు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కనుక ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం తెరాస తప్పు. జిల్లాకు ఉపయోగపడే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు, అక్కడికి అనుచరులతో కలిసి వెళ్ళి గొడవ పడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పు. హరీష్ రావు, కోమటిరెడ్డి ఇద్దరూ సీనియర్ నేతలే. తమ సమక్షంలోనే తమ అనుచరులు ఒకరిపై మరొకరు రాళ్ళు విసురుకొని దాడులు చేసుకొంటుంటే వారిని అడ్డుకోకపోవడం ఇద్దరి తప్పు. ఇద్దరూ తప్పు చేసి మళ్ళీ రెండు పార్టీలు పరస్పరం నిందించుకోవడం మరో తప్పు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉండి ఉంటే హరీష్ రావుకు హుందాగా ఉండేది. ఒకవేళ అప్పుడు కూడా కోమటిరెడ్డి ఇలాగే గొడవ చేసి ఉండి ఉంటే అందరూ ఆయననే వేలెత్తి చూపి ఉండేవారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సంయమనం పాటించి ఆ కార్యక్రమానికి వెళ్ళకుండా మీడియా ద్వారా తన నిరసన తెలియజేసి ఉండి ఉంటే హుందాగా ఉండేది. భౌతిక దాడులు తప్పని చెపుతున్న జానారెడ్డి అదే మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా చెప్పి ఉండి ఉంటే బాగుండేది. రాజకీయాలలో ఉన్నవారు భౌతికదాడుల దుసంప్రదాయానికి శ్రీకారం చుడితే దాని వలన వారే నష్టపోతారని గ్రహించడం మంచిది. 


Related Post