ఆ ఇద్దరు రెడ్లు భాజపాలో చేరబోతున్నారా?

May 18, 2017


img

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సోదరులు భాజపాలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా నుంచే అమిత్ షా తన పర్యటన ప్రారంభించడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరికపై అడిగిన ప్రశ్నకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమాధానం చెప్పకుండా దాటవేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. 

రాష్ట్రంలో మరో బలమైన నేత రేవంత్ రెడ్డి కూడా భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను తెదేపాలోనే ఉన్నా భాజపాలో ఉన్నా రెండు పార్టీలకు లాభమే తప్ప నష్టం ఉండదు,” అని రేవంత్ రెడ్డి అన్న మాట ఆయన భాజపాలో చేరవచ్చనే అభిప్రాయం కలిగిస్తోంది. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికి వస్తే అయన పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించడం లేదు. ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలోనే పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటుందని అందరూ ఆయన నాయకత్వం క్రిందే కలిసికట్టుగా పనిచేయాలని ఖచ్చితంగా చెప్పింది. అంతేకాదు..నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి నిర్వహించాలనుకొన్న బహిరంగ సభకు ‘నో’ చెప్పేసింది. ఉత్తం కుమార్ రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ పరిణామాలన్నీ జీర్ణించుకోవడం కష్టమే. కనుక ఆయన భాజపావైపు చూస్తే ఆశ్చర్యం లేదు. 

ఇక రాష్ట్రంలో తెదేపా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం  మాత్రమే ఉంది. ఆలోగానే రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ గురించి సరైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఇలాగే తెరాసను ఎదుర్కొంటూ మరో ఐదేళ్ళపాటు రాజకీయాలలో కొనసాగడం కష్టం అవుతుంది. పైగా తెరాస చేతిలో ఓటుకు నోటు కేసు అనే ఒక బలమైన ఆయుధం కూడా ఉంది. కనుక ఈ రెండు సమస్యల నుంచి బయటపడాలంటే అందుకు ఏకైక ప్రత్యామ్నాయం భాజపాలో చేరడమే. 

రాష్ట్రంలో తెదేపా ఎలాగు కొనప్రాణాలతో ఉంది. దానికి భాజపా ఎప్పుడో దూరం అయ్యింది. రాష్ట్రంలో తెదేపాపై చంద్రబాబు నాయుడు కూడా ఆసక్తి కోల్పోయారు. కనుక రేవంత్ రెడ్డి భాజపాలో చేరితే ఆయనకు ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. పైగా రేవంత్ రెడ్డి చెప్పుకొనట్లుగా ఆయన భాజపాలో ఉంటేనే చంద్రబాబుకి కూడా మంచిది. కనుక ఈ ఇద్దరు కాంగ్రెస్, తెదేపా నేతలు భాజపాలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? అనే సందేహం కూడా ఉంది. ఎందుకంటే వారిద్దరూ ఆవేశపరులే. పార్టీపై ఆధిపత్యం కోరుకొనేవారే. కనుక వారిద్దరూ భాజపాలో చేరుతారా..లేదా ఒక్కరే చేరుతారా? అసాలు చేరుతారా లేదా అనే ప్రశ్నలకు సమాధానం మే 22న లభించవచ్చు. 


Related Post