నోట్ల రద్దు తరువాత దేశప్రజలు నోట్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం నగదు రహిత లావాదేవీలేనని కేంద్రప్రభుత్వం వాదిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి వంతపాడుతూ చాల హడావుడి చేశాయి. సరిగ్గా అదే సమయంలోనే దేశప్రజల ముందు హటాత్తుగా సాక్షాత్కరించింది పేటిఎం.
అది డిల్లీ కేంద్రంగా 2010 లోనే స్థాపించబడి ఉత్తర భారతంలో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నప్పటికీ, నోట్ల రద్దు జరిగిన తరువాతే దేశమంతటా హటాత్తుగా ప్రత్యక్షమయింది. ‘ఇందు గలదు అందు లేదనే సందేహం వలదు’ అన్నట్లు చేపల బజారు మొదలు మల్టీ ప్లెక్ వరకు అన్ని చోట్ల పేటిఎం బోర్డులు దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాయి. నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా ఏ ప్రయోజనం కనబడలేదు కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాల కారణంగా పేటిఎం వ్యాపారం మాత్రం చాలా బాగా పుంజుకొంది.
తాజా సమాచారం ఏమిటంటే ఈనెల 23 నుంచి పేటిఎం సంస్థ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. పేటిఎం తన 21.8 కోట్లు మంది ఈ వ్యాలెట్ ఖాతాదారులతో సాగిస్తున్న వ్యాపారాన్ని, ఖాతాదారుల నగదు నిలువలను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ పేటిఎం బ్యాంకులోకి మార్చబోతోంది. ఒకవేళ ఖాతాదారులు వద్దనుకొంటే ఆ విషయం మే 23లోగా పేటిఎంకు తెలియజేయాలి.
జియో 10 కోట్లు మంది ఖాతాదారులను సంపాదించుకోవడానికి సుమారు ఏడాది పట్టింది. అందుకోసం అది అనేక ఉచిత ఆఫర్లు ప్రకటించి నేటికీ వాటిని కొనసాగించవలసి వస్తోంది. దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడానికి ఏళ్ళతరబడి కృషి చేయవలసివచ్చింది. కానీ పేటిఎం ఎవరికీ పెద్దగా ఆఫర్లు ఇవ్వకుండానే, ఏమాత్రం కష్టపడకుండానే కేవలం 6 నెలల వ్యవధిలో ఏకంగా 21.8 కోట్లు మంది ఖాతాదారులను సంపాదించుకోగలిగింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుపెట్టక మునుపే ఏకంగా 21.8 కోట్లు మంది ఖాతాదారులు కలిగిన ఏకైక బ్యాంక్ పేటిఎం మాత్రమే. ఇవన్నీ గమనిస్తే నోట్ల రద్దు-నగదు రహిత లావాదేవీల వలన బాగుపడింది ఎవరు అంటే పేటిఎం ఒక్కటే అని అనిపించకమానదు.