ధర్నా చౌక్ కోసం అధికార, ప్రతిపక్షాల మద్య దాదాపు చిన్న సైజు యుద్ధం జరిగిన తరువాత హటాత్తుగా అందరూ నిశబ్ధం అయిపోయారు. ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను తరలించాలనే తన నిర్ణయానికి తెరాస సర్కార్ కట్టుబడి ఉందా లేక మొన్న జరిగిన గొడవను చూసిన తరువాత మనసు మార్చుకొని అక్కడే కొనసాగనిస్తుందా? ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉంటే ప్రతిపక్షాలు మళ్ళీ ధర్నా చౌక్ కోసం పోరాడుతాయా లేక వేరే సమస్యకు షిఫ్ట్ అయిపోతాయా? అనే సందేహాలున్నాయి.
ప్రభుత్వం కోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ధర్నా చౌక్ వద్ద మొన్న జరిగిన హింసాకాండ వలన అక్కడ ధర్నా చౌక్ ను కొనసాగించడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని నిరూపించేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పుడు బలమైన ఆధారాలున్నాయి కనుక ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించాలని కోర్టును కోరవచ్చు. కోర్టు కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించే అవకాశాలే ఎక్కువ. కనుక తెరాస సర్కార్ చేతికి మట్టి అంటకుండా కోర్టు తీర్పును ఫాలో అయిపోవచ్చు. అయినా ఎందుకైనా మంచిదని “ధర్నా చౌక్ తరలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ చెప్పలేదు కదా?” అని తెరాస నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ప్రతిపక్షాలు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే కోర్టు అక్కడ ధర్నా చౌక్ కొనసాగించడానికి అనుమతించకపోయినట్లయితే, ప్రతిపక్షాలు కూడా న్యాయపోరాటాలకు సిద్దం కావలసి ఉంటుంది. అందుకు అవి సిద్దమేనని భావించవచ్చు.
ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చినట్లయితే, ప్రభుత్వానికి అది అప్రదిష్ట, అవమానకరమే అవుతుంది. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకొన్న తెరాస సర్కార్ కు కోర్టు బుద్ధి చెప్పిందని, ఈ ధర్మయుద్ధంలో చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందని ప్రతిపక్షాలు గొప్పలు చెప్పుకోవచ్చు.
ఏమైనప్పటికీ, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కొనితెచ్చుకొన్న సమస్య అని చెప్పక తప్పదు. కనుక దాని ఫలితం ఏవిధంగా ఉన్నా భరించకతప్పదు. అయినా రోట్లో తలపెట్టి రోకటిపోటుకు భయపడితే కుదరదు కదా?