పాపం పోలీసులు!

May 17, 2017


img

ఖమ్మం మార్కెట్ యార్డు దాడి కేసులో అరెస్ట్ అయిన రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు హాజరుపరిచినందుకు ఇద్దరు పోలీస్ అధికారులపై తెరాస సర్కార్ సస్పెన్షన్ వేటు వేసిణ సంగతి తెలిసిందే. మొన్న ధర్నా చౌక్ వద్ద సాధారణ దుస్తుల ధరించి ప్లకార్డులు పట్టుకొని ప్రజలతో కలిసి ధర్నాలో పాల్గొన్నందుకు లేక్ వ్యూ సిఐ శ్రీదేవిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఆమెను సిఐ విధులలో నుంచి తప్పించి సెంట్రల్ జోన్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమీషనర్ డి.జోయాల్ డేవిస్ చెప్పారు. 

ఈ రెండు కేసులలో సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు వారంతటవారుగా ఇటువంటి పనులు చేస్తారని అనుకోలేము. వారికి ఆ అవసరం లేదు కూడా. ఖమ్మం మార్కెట్ యార్డు దాడి కేసులో ప్రభుత్వ ఆదేశాల మేరకే వారు రైతులపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని అందరికీ తెలుసు. ‘ఆ దాడికి పాల్పడినవారు రైతులు కాదు గూండాలు, రౌడీలు’ అని నేటికీ తెరాస నేతలే బల్ల గుద్ది వాదిస్తున్నారు. కానీ ‘వారు గూండాలు కాదు రైతులే’ అని పోలీసులు ప్రభుత్వంతో వాదించలేరు కనుకనే వారు తమ నియమనిబందనల ప్రకారం ‘గూండాలుగా చెప్పబడిన రైతులకు’ బేడీలు వేసి కోర్టుకు తెచ్చారు. అందుకు ఇద్దరు పోలీస్ అధికారులు బలైపోయారు.

ధర్నా చౌక్ కేసులో కూడా సి.ఐ. శ్రీదేవిని, మఫ్టీలో వచ్చిన మహిళా పోలీసులను తప్పు పట్టడానికి లేదు. వారిని మఫ్టీలో వెళ్ళి అరాచకశక్తులను కనిపెట్టమని తామే ఆదేశించామని డిప్యూటీ పోలీస్ కమీషనర్ డి.జోయాల్ డేవిస్ చెప్పారు. కానీ వారు నియమ నిబందనలు ఉల్లంఘించి ప్లకార్డులు పట్టుకొని ధర్నాలో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకొన్నామని చెపుతున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ‘అశ్వథామ హతః కుంజరః’ అన్నట్లుంది ఆ మాట. ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులు ఆదేశించకపోతే ఒక బాధ్యాతాయుతమైన సి.ఐ.హోదాలో పనిచేస్తున్న శ్రీదేవి, ఆ మహిళా పోలీసులు ఆవిధంగా ఎందుకు వ్యవహరిస్తారు? ఆవిధంగా చేయడం నియమనిబంధనలను ఉల్లంఘించడమే అని వారికి తెలియదా? అని ఆలోచిస్తే నిజం అర్ధం అవుతుంది. 

ఈ రెండు కేసులలో పోలీసులు తమపై అధికారులు లేదా ప్రభుత్వం ఆదేశించినట్లే నడుచుకొన్నారు. కానీ అందుకు ప్రతిఫలంగా వారే  బలైపోయారని చెప్పక తప్పదు. సిఐ శ్రీదేవి ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రముఖంగా ప్రచురింపబడినందున వ్యక్తిగతంగా కూడా ఆమె చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అధికార, ప్రతిపక్షాలు ఆడుకొనే రాజకీయ చదరంగంలో పోలీసులు బలైపొతుండటం చాలా బాధాకరం. 


Related Post