కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు దేశాన్ని పాలించినప్పుడు ఎక్కువగా వినపడిన మాటలు రెండే. 1.అవినీతి 2.కుంభకోణాలు. ‘ఇందుగలదు అందులేదనే సందేహం లేకుండా దాని హయంలో అవినీతి సర్వత్రా వ్యాపించి వ్యవస్థీకృతం అయిపోయింది. అందుకే 2014 ఎన్నికలలో దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి కేంద్రంలో భాజపాకు, వివిధ రాష్ట్రాలలో ఇతర ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెట్టారు.
అయితే కాంగ్రెస్ నేతలందరూ తాము పరమపవిత్రంగా విధులు నిర్వర్తించామని, ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని వాదిస్తుంటారు. కానీ గ్రామంలో అందరూ శాఖాహారులే అయితే గంపెడు రొయ్యలు ఏమైపోయాయి? అన్నట్లు కాంగ్రెస్ హయంలోనే బయటపడిన అనేక కుంభకోణాలకు ఎవరు బాధ్యులు? అంటే అసలు అవినీతే జరుగనప్పుడు మళ్ళీ బాధ్యులు ఎవరు? అని అడిగితే ఎలాగ? అని ఎదురుప్రశ్నిస్తుంటారు.
తాము అవినీతికి పాల్పడితే తప్పు లేదు కానీ దానిపై సిబిఐ దర్యాప్తు చేస్తే అది తమను వేధించడమేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తుంటారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తిరిగి కేంద్రప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి ఇదే సరైన పద్దతిగా పాటిస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతికి పాల్పడిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు జారీ చేస్తే అందుకు వారు సిగ్గుపడకపోగా, కాంగ్రెస్ నేతలను వెంటపెట్టుకొని ఊరేగింపుగా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకొన్నారు. ఆ కేసులో తమకు కోర్టు సమన్లు జారీ చేయడం రాజకీయ కక్ష సాధింపేనని వాదిస్తుంటారు.
తాజాగా ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం, అయన కుమారుడు కార్తి ఇళ్ళపై, అలాగే అక్రమాస్తుల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ఇళ్ళపై సిబిఐ దాడులు చేసి శోదాలు నిర్వహిస్తే అవి కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు..దేశంలో ప్రతిపక్ష పార్టీ నేతలు చాలా మంది ఇదే సిద్దాంతాన్ని ఫాలో అయిపోయితూ శిక్ష పడకుండా తప్పించుకొంటున్నారు.
అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులైనా చేయవచ్చు. అప్పుడు ఎలాగూ ఎవరికీ జవాబు చెప్పవలసిన అవసరం లేదు. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి మారినా వారిని ఎవరూ ప్రశ్నించకూడదు. దర్యాప్తు చేయకూడదు. చట్టప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకొంటే అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే పరిగణింపబడతాయిట! అంటే రాజకీయ నేతలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వారు తమ చుట్టూ ఒక పటిష్టమైన రక్షణ కవచాన్ని ఏర్పరచుకొన్నారని అర్ధమవుతోంది.
మరి అవినీతిపరులను ఎప్పుడు శిక్షించాలి? అనే ప్రశ్నకు కూడా రాజకీయ పార్టీలు ఒక స్టాండర్డ్ సమాధానం ప్రజల కోసం సిద్దం చేసి పెట్టాయి. ‘అవినీతికి పాల్పడినవారిని ఎన్నికలలో ఓడించి ప్రజలే బుద్ధి చెపుతారని’ ఆ సమాధానం. అంటే వేలకోట్లు మింగేసినవారిని ఎన్నికలలో ఓడిస్తే చాలు వారి నేరాలన్నీ రద్దు అయిపోతాయని అనుకోవాలన్న మాట.