ఐటి సంక్షోభానికి 125 కోట్ల పరిష్కారాలు!

May 17, 2017


img

విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐ.బి.ఎం. ఇలాగ వరుసగా అనేక ఐటి కంపెనీలు హటాత్తుగా వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నట్లు నిత్యం మీడియాలో వస్తున్న వార్తలు ఆ రంగంలో ఉన్నవారికే కాకుండా ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా  చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ సర్కార్ నిర్ణయాలేనని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆయన తన దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొంటున్న నిర్ణయాలను తప్పుపట్టడం అందుకు ఆయనను నిందించడం సరికాదనే చెప్పాలి. 

నీళ్ళు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల కారణంగా  రాష్ట్ర విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రావాళ్ళు వెళ్ళిపోతే తెలంగాణా ప్రజలకు కనీసం రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ చెప్పినట్లే ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చెపుతున్నారు. కనుక అమెరికాలోకి విదేశీయులు రాకుండా అడ్డుకొని, ఉన్నవారిని బయటకు పంపించేసి అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చుకోవాలని ట్రంప్ భావిస్తే తప్పు కాదు. అయితే రాత్రికి రాత్రే ఈ పని జరిగిపోవాలన్నట్లుగా విపరీతమైన ఒత్తిడి చేస్తుండటమే అందరికీ ఊహించని కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. చాలా మందిని రోడ్డున పడేసి ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పుడు ఆందోళనతో తలపట్టుకొని కూర్చొనే సమయం కాదు. ఈ సమస్య ఇంకా పెరిగి సామాజిక సమస్యలకు దారి తీయక మునుపే తాత్కాలిక, శాశ్విత పరిష్కారాల కోసం ఆలోచించాలి.

 125 కోట్లకు పైగా ఉన్న మన దేశం ఈ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ల ఒకటని అందరికీ తెలుసు. కనుక భారత్ లో ఉపాది అవకాశాలకు ఎన్నడూ కరువు ఉండదనే చెప్పాలి. కానీ ఐటి రంగంలో ఉన్నవారు భారత్ లో ఏమి చేయగలరు? అని సంకోచించనవసరం లేదు. భారత్ సాఫ్ట్ వేర్ నిపుణులకు పెట్టింది పేరు కానీ నేటికీ మనం సాఫ్ట్ వేర్ కోసం ఇతర దేశాల ఉత్పత్తుల మీద ఆధారపడవలసి వస్తోంది. ఉదాహరణకు విండోస్, వర్డ్, ఎక్సెల్ వగైరా ఉత్పత్తులకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో నేటికీ మనం మైక్రోసాఫ్ట్ మీదే ఆధారపడుతుండటంతో అదే ప్రపంచాన్ని శాశిస్తోంది. 

అలాగే ఇప్పుడు దేశంలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. కానీ మొబైల్స్..వాటి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, చివరకి వాటి ఎక్ససరీస్ కోసం నేటికీ మనం చైనా మీద ఆధారపడవలసి వస్తోంది. దేశీయంగా మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్న సంస్థలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. 

రిలయన్స్ జియో సంస్థ సుమారు 10 కోట్ల మంది కొత్త ఖాదారులను కూడగట్టుకోగలిగింది. అది చాలా గొప్ప విషయమే. కానీ వారికి జియో ఆఫర్ ప్లాన్లలో భాగంగా ఫోన్లు అందించేందుకు చైనా నుంచి మొబైల్స్ ఫోన్స్ దిగుమతి చేసుకొంది. అంటే జియో వలన ఆ సంస్థకు, ప్రజలకు ఎంత లాభం కలిగిందో చైనా కంపెనీలకు అంతే లాభం పొందాయన్న మాట!  

ఇక టీవీలు, ఫ్రిజ్జులు, వంటి విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలు కార్లు వరకు విదేశీ సంస్థలు తయారు చేస్తున్నవే కొని వాడుకొంటున్నాము. మనం చైనా మీద ఎంతగా ఆధారపడుతున్నామంటే, ఇటీవల కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ‘నగదు రహిత లావాదేవీల భూతం’ ఆవహించినప్పుడు వాటిని నిర్వహించేందుకు అవసరమైనన్ని ‘పోస్ మెషిన్లు’ లేకపోవడంతో లక్షల కొద్దీ మెషిన్లను హడావుడిగా చైనా నుంచి రప్పించుకోవలసి వచ్చింది. 

అన్ని రంగాలలో మనకు అత్యంత నిపుణులైన మానవ వనరులు ఉన్నప్పుడు, వారి సేవలను వినియోగించుకొనేందుకు 125 కోట్లకు పైగా జనాభా ఉన్నప్పుడు మనం ఇంకా ఈవిధంగా పరాయి దేశాల మీద, వారి దయాదాక్షిణ్యాలపైన ఎందుకు ఆధారపడుతున్నాము? మన తెలివితేటలు, ప్రతిభ, పెట్టుబడి విదేశాలకు ఉపయోగపడుతున్నప్పుడు మనదేశానికి ఉపయోగపడవా? మనం ఒక చిన్న సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అభివృద్ధి చేసుకోలేమా? మొబైల్ ఫోన్, పోస్ మెషిన్, ఈవిఎంలను కూడా మనం స్వంతంగా తయారుచేసుకోలేని దుస్థితిలో ఉన్నామా? 

లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లున్న మన దేశంపై సైబర్ దాడులు జరుగుతుంటే, వాటిని అడ్డుకొనే వ్యవస్థలను రూపొందించుకోలేమా? అని ఆలోచిస్తే ఐటి మరియు వివిధ రంగాలలో నిపుణులకు మనదేశంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అర్ధం అవుతుంది. 

కానీ ‘ఇంకా కొంప మునగలేదు కదా..’ అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు వేల సంఖ్యలో నిరుద్యోగులుగా మారుతున్న ఐటి ఉద్యోగుల సంఖ్య ఏడాది గడిచేసరికి లక్షలకు చేరవచ్చు. పరిస్థితులు పూర్తిగా విషమించిన తరువాత అప్పుడు పరుగులు తీసినా ప్రయోజనం ఉండదు. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఐటి నిపుణులు, ప్రవాస భారతీయులు అందరూ అలోచించి చురుకుగా నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇదే.


Related Post