తెలంగాణాలో వైకాపా ఉంది కానీ ‘నామ్ కే వాస్తే’ అన్నట్లుంటుంది. టి-వైకాపా నేతలు రాష్ట్రంలో ఏ సమస్య గురించి ఎన్నడూ నోరు విప్పరు. జగన్ ఉండేది హైదరాబాద్ లోనే అయినా తెలంగాణాలో సమస్యల గురించి ఎన్నడూ మాట్లాడరు. ఆయన దృష్టి ఎప్పుడూ ఆంధ్రామీద, చంద్రబాబు మీద..తెదేపా ప్రభుత్వం మీదే ఉంటుంది. ఆయన ఏపిలో ఎక్కడ ఏమి జరిగినా తక్షణం అక్కడ వాలిపోయి ప్రజాసమస్యల గురించి ఆవేశంగా మాట్లాడేసి, తెదేపా ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తుంటారు.
ఈరోజు జి.ఎస్.టి.బిల్లు ఆమోదం కోసం ఏపి శాసనసభ ప్రత్యేక సమావేశమైనప్పుడు, మిర్చి రైతుల సమస్యల సభలో చర్చ జరగాలని పట్టుబడుతూ వైకాపా ఎమ్మెల్యేలు సభను స్తంభింపజేయాలని ప్రయత్నించారు. కానీ వారిని పట్టించుకోకుండా శాసనసభలో బిల్లును ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేశారు.
తరువాత జగన్ మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా ప్రభుత్వానికి పివి సింధు మీద ఉన్న శ్రద్ద మిర్చి రైతులపై లేదు. గిట్టుబాటు ధరలు లభించక ఒకపక్క మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా తెదేపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈరోజు నుండి మార్కెట్ యార్డుకు శలవులు ప్రకటించేసి మిర్చి రైతులను నిలువునా ముంచుతోంది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. అందుకే మార్కెట్ యార్డును మూసివేశారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా దానిని అమలుచేయడానికి తెదేపా ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం చాలా దారుణం,” అని జగన్ విమర్శించారు.
ప్రస్తుతం తెలంగాణాలో మిర్చి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అందరికీ తెలుసు. కనుక జగన్ తెదేపా ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలే తెరాస సర్కార్ కూడా సరిగ్గా సరిపోతాయి. కానీ జగన్ ప్రశ్నించరు. ఎందుకంటే ఆయన ఎప్పటికైనా ఆంధ్రాకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. కానీ తెలంగాణాలో ఆయనకు ఆ అవకాశం ఎన్నడూ రాదు. కనుక ఆయనకు తెలంగాణా సమస్యల గురించి మాట్లాడే ఆసక్తి, ఓపిక రెండూ లేనట్లే కనబడుతోంది. అయినా తెలంగాణాలో పార్టీని సజీవం ఉంచుతున్నారు. దానికి అనేక కారణాలు వినపడుతుంటాయి.
కొసమెరుపు: గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ఏపి సర్కార్ మంగళవారం నుంచి మోదలవవలసిన శలవులను రద్దు చేసింది. రేపటి నుంచి రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు యధా ప్రకారం మిర్చి కొనుగోళ్ళు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మండిపోతున్న ఈ ఎండలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డుకొచ్చే మిర్చి రైతులకు చల్లటి మజ్జిగ, మంచినీళ్ళు, సేద తీరేందుకు యుద్ద ప్రాతిపదికన తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జగన్ కు ఈ సంగతి తెలుసో తెలియదో?