కోమటిరెడ్డి సమస్య ఏమిటో?

May 16, 2017


img

నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఈరోజు బొత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయడానికి వచ్చారు. జిల్లా ఎమ్మెల్యేనయిన తనకు మాట మాత్రంగా చెప్పకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి తన అనుచరులను వెంటేసుకొని ర్యాలీగా అక్కడికి చేరుకొన్నారు. మంత్రి హరీష్ రావుకు స్వాగతం చెపుతూ తెరాస కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లను కోమటిరెడ్డి అనుచరులు చించివేయడంతో తెరాస కార్యకర్తలు ఆగ్రహించి వారిపై రాళ్ళతో దాడి చేశారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదురుదాడి చేయడంతో ఆ ప్రాంతం అంతా యుద్దరంగంలాగ మారిపోయింది. పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని మళ్ళీ అదుపులోకి తేగలిగారు. 

రాజులు..రాజ్యాలు పోయాయి. కానీ మన ప్రజాప్రతినిధులు ఆ రాచరిక లక్షణాలను అందుకొని నేటికీ కొనసాగిస్తున్నారని చెప్పడానికి ఇదే ఒక చక్కటి ఉదాహరణ. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా ఎంపి నియోజకవర్గానికి అతను లేదా ఆమె రారాజు. అక్కడ వారి మాటే వేదవాక్కు. అది సదరు ప్రజాప్రతినిధి స్వంత రాజ్యం అంటే ఇలాఖా. దానిలోకి వేరొకరు ప్రవేశించడానికి వీలులేదు. ప్రవేశించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. దానికే మనం ప్రోటోకాల్ అనే ముద్దు పేరు పెట్టుకొన్నాము. 

మంత్రి హరీష్ రావు ప్రోటోకాల్ పాటించలేదు కనుక కోమటిరెడ్డి వారికి ఆగ్రహం కలిగింది. అక్కడ మార్కెట్ యార్డ్ నిర్మిస్తే తన రాజ్యంలోని రైతులకే మేలు కలుగుతుందని తెలిసినా ప్రోటోకాల్ పాటించకపోతే ఇలాగే యుద్దానికి బయలుదేరుతారు. ఈ సంగతి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావుకు తెలియదనుకోలేము. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేను పట్టించుకోనవసరం లేదని ఆయన భావించడం వలన ఈ సమస్య తలెత్తింది.  

శంఖుస్థాపన తరువాత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణాకు..రైతులకు ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము చేస్తున్నా అడ్డుపడుతోంది. జిల్లాలో రైతన్నలకు మేలు కలిగే పనికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడటం సరికాదు. ఆయన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు పక్కనపెట్టారో గ్రహించకుండా ఇంకా ఇలాగే ప్రవర్తిస్తుంటే ప్రజలే వారికి బుద్ధి చెపుతారు,” అని అన్నారు.


Related Post