తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు, తరువాత కొన్ని రోజులు తెలంగాణా సెంటిమెంటును ఉపయోగించుకొన్న సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీగా అది తన ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవడం తప్పు కాదు. ఆ తరువాత వరుసగా అనేక సమస్యలు ఎదురైనప్పుడు ‘గత ప్రభుత్వాలదే బాధ్యత’ అంటూ కొన్ని రోజులు తప్పించుకొంది. అది వాస్తవం కనుక ప్రజలు కూడా సహృదయంతో తెరాస వాదనను అంగీకరించి అది నిలద్రొక్కుకోవడానికి మూడేళ్ళు వేచి చూశారు. కానీ ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగానే నిలిచిపోవడంతో ప్రజల్లో క్రమంగా అసహనం, అసంతృప్తి పెరుగుతోంది.
ఈ మూడేళ్ళలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ఏ ఒక్క సమస్య ఇంతవరకు పూర్తిగా పరిష్కారం కాకపోవడం కూడా ప్రజలలో అసంతృప్తి పెరగడానికి మరొక కారణంగా చెప్పవచ్చు. ఉదాహరణకు సింగరేణి వారసత్వ ఉద్యోగాల సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై న్యాయవివాదం మొదలైంది కనుక అది ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. మిర్చి మద్దతుధర, కొనుగోళ్ళు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దానిపై అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధం మాత్రమే జరుగుతోంది తప్ప మిర్చి రైతుల సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా వరి, కంది రైతులు సమస్యలున్నాయి. ధర్నా చౌక్ తరలింపుపై కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రభుత్వోద్యోగాలలో ఖాళీల భర్తీ, నిర్వాసితుల సమస్యలు, త్రాగునీటి కొరత, తెరాస ఎన్నికల హామీలు అమలు ఇలాగ చెప్పుకొంటూపోతే చాలా సమస్యలు పరిష్కరించవలసి ఉంది.
అన్ని సమస్యలను పరిష్కరించడానికి మూడేళ్ళ సమయం చాలా తక్కువే కనుక అత్యాశ పనికి రాదు. కానీ ఈ మూడేళ్ళలో ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో ప్రాధాన్యతా క్రమంలో పనులు జరుగకపోవడం, ఇంకా కొత్త సమస్యలు పేరుకుపొతుండటం చేత ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో అధికారాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే కేంద్రీకృతం కావడం, అన్నిటిపై తనే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలనుకోవడం వలననే పనులలో వేగం తగ్గినట్లుందని, కనుక పరిపాలనా వికేంద్రీకరణ చేయడమే అందుకు పరిష్కారమని ప్రముఖ రచయిత, తెలంగాణా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు.
అయితే తెరాస సర్కార్ అసలు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోందని చెప్పడం కూడా తప్పే. త్రాగునీరు (మిషన్ భగీరథ), సాగునీటి ప్రాజెక్టులు, జిల్లాల పునర్విభజన, తద్వారా అధికార వికేంద్రీకరణ, చెరువుల పూడికతీత (మిషన్ కాకతీయ) విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టడం వంటి అనేక మంచి కార్యక్రమాలు సమర్ధంగా చేసి చూపించింది. అయితే ప్రజల అంచనాలు బాహుబలి స్థాయిలో ఉన్నందున తెరాస సర్కార్ పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి, అసహనం కనబడుతోంది.