ఆంధ్రజ్యోతిపై నిషేధం!

May 16, 2017


img

ఏపిలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడంపై తెదేపా, వైకాపా నేతల మద్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా కూడా ఆ యుద్దంలో పాల్గొంటుండటం మరో విశేషం. 

జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం గురించి తప్పుడు కధనాలు ప్రచురిస్తున్న కారణంగా ఇక నుంచి తమ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి మీడియాను అనమతించమని వైకాపా ప్రకటించింది. అంతే కాదు.. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా అసత్య కధనాలు ప్రసారం చేస్తున్నందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వైకాపా ప్రకటించింది. 

ఒక పార్టీ లేదా ప్రభుత్వం యొక్క తప్పొప్పులను నిష్పక్షపాతంగా చెప్పాల్సిన మీడియాకు, రాజకీయ పార్టీలకు మద్య ఉండవలసిన సన్నటిగీత చెరిగిపోయినప్పటి నుంచి మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీని, ప్రభుత్వాన్ని భుజానికెత్తుకొని మోస్తుండటం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. కొన్ని పార్టీలు స్వంతంగా మీడియానే ఏర్పాటు చేసుకొని తమ అభిప్రాయాలనే ప్రజాభిప్రాయాలుగా చెప్పడం అందరూ చూస్తూనే ఉన్నారు.  

జగన్ కు చెందిన సాక్షి మీడియా ప్రజల మనసాక్షి అని చెప్పుకొంటుంది కానీ వాస్తవానికి అది జగన్ మనసాక్షి అని అందరికీ తెలుసు. జగన్ చంద్రబాబు నాయుడుని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు కనుక సాక్షిలో కూడా అదే ప్రతిభింభిస్తుంటుంది. దానిలో నిత్యం తెదేపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వార్తలు, కధనాలు ప్రచురింపబడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏమి చేసినా దానిని తప్పు పట్టడం, అవినీతి జరిగిపోతోందని సాక్షి మీడియాలో కధనాలు ప్రచురించడం, వాటిని తెదేపా నేతలు గట్టిగా ఖండించడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

సాక్షి మీడియాలో చంద్రబాబుని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పుగా భావించని జగన్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తనకు వ్యతిరేకంగా కొన్ని కధనాలు ప్రచురిస్తే తట్టుకోలేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపిలో కొన్ని న్యూస్ ఛానల్స్ తెదేపా సర్కార్ కు వ్యతిరేకంగా వార్తలు, కధనాలు ప్రసారం చేస్తున్నందుకు అది వాటిపై అప్రకటిత నిషేధం విదించడాన్ని తప్పు పట్టిన జగన్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిపై నిషేధం విదిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటే బహుశః ఇదేనేమో?     


Related Post