తెరాస సర్కార్ తీసుకొంటున్న కొన్ని అప్రజాస్వామిక నిర్ణయాలు ప్రజలలో అసంతృప్తిని పెంచుతున్న మాట వాస్తవం. దానినే ప్రొఫెసర్ కోదండరామ్, ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుసు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు సమస్యలను పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే మరొకవైపు ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవడం కూడా చాలా అవసరం. కనుక తెరాస నేతలు అదే పని చేస్తున్నారని చెప్పవచ్చు.
అయితే తమ అప్రజాస్వామిక నిర్ణయాలను, తప్పులను ఎత్తి చూపుతున్న వారిని తెలంగాణా ద్రోహులు ముద్ర వేసేందుకు ప్రయత్నించడం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణా సాధన కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో ప్రొఫెసర్ కోదండరామ్ కూడా అంతే కష్టపడ్డారని అందరికీ తెలుసు. అలాగే విద్యార్ధులు, ప్రజా సంఘాలు, సింగరేణి కార్మికులు ఇంకా అనేక వర్గాలకు చెందినవారు కూడా తెలంగాణా సాధనలో కేసీఆర్ తో కదంకదం కలిపి నడిచారు.
వారు ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కనుక తెలంగాణా ద్రోహులైపోరు. కానీ వారందరూ ద్రోహులే అన్నట్లు తెరాస నేతలు మాట్లాడుతున్నారు. ఈ వాదనతో తెరాస సర్కార్ ఆత్మరక్షణ చేసుకొంటూ ప్రజలను మెప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. కానీ వారి ఈ వాదన ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరిగేందుకే దోహదపడవచ్చు.
ఉదాహరణకు ప్రొఫెసర్ కోదండరామ్ నిరుద్యోగర్యాలీ తలపెట్టినప్పుడు, మిర్చి రైతులు ఖమ్మం మార్కెట్ యార్డ్ పై దాడి చేసినప్పుడు, నిన్న ఇందిరా పార్క్ వద్ద వామపక్షాలు హింసకు పాల్పడినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస నేతలందరూ ఈ దాడులకు పాల్పడుతున్నది గూండాలు..అరాచక శక్తులు..అని వాదిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే ప్రతిపక్షాలు ఈవిధంగా కుట్రలు పన్నుతున్నాయని వాదిస్తున్నారు.
అయితే నిరుద్యోగులపై, మిర్చి రైతులపై, వామపక్ష కార్యకర్తలపై, ప్రజాసంఘాల కార్యకర్తలపై ‘గూండాలు..అరాచక శక్తులు’ అనే ముద్రవేసినంత మాత్రాన్న కళ్ళెదుట ప్రత్యక్షంగా కనబడుతున్న నిజాలను ప్రజలు అర్ధం చేసుకోలేరనుకోవడం ప్రజల విజ్ఞత పట్ల చిన్నచూపుగానే భావించాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలపై ధర్నాలు చేసినవారందరూ గూండాలే అని తెరాస నేతలు వాదిస్తే వాటిని ప్రజలు నమ్మేస్తారనుకొంటే అది ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడమే అనుకోవలసి ఉంటుంది.