ఖమ్మం మార్కెట్ యార్డుకు మంగళవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మూసివేయబోతున్నట్లు (శలవులు) అధికారులు ప్రకటించారు. మిర్చికి గిట్టుబాటు ధర రాక రైతులు కుమిలిపోయి ఆత్మహత్యలు చేసుకొంటుంటే, అదనపు గంటలు, రోజులు పనిచేసి మిర్చిని కొనుగోలు చేయకపోగా నేటి నుంచి మూడు వారాలు మార్కెట్ మూసివేయాలని అధికారులు నిర్ణయించడం విస్మయం కలిగిస్తుంది.
కేంద్రప్రభుత్వం క్వింటాలుకు రూ.5,000 అదనపు ఖర్చుల నిమిత్తం రూ.1,250 చొప్పున మద్దతు ధర ప్రకటించి మే 2వ తేదీ నుంచి ఈ నెలాఖరువరకు మిర్చి కొనుగోళ్ళు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ధరతో తెలంగాణా రాష్ట్రంలో కేవలం 33,000 టన్నుల మిర్చిని మాత్రమే ఈ నెలాఖరు వరకు కొనుగోలు చేయడానికి అనుమతించింది. ఈ ఏడాది సుమారు 7 లక్షల క్వింటాళ్ళు మిర్చి పండినట్లు సమాచారం. దానిలో 33,000 టన్నులంటే వారం రోజులలోనే ఆ మాత్రం కొనుగోళ్ళు పూర్తయిపోతాయి. కానీ ఇంకా కొనుగోళ్ళు చేయమని రైతులు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కనుక తమ ఒత్తిడి నుంచి తప్పించుకోనేందుకే ఖమ్మం మార్కెట్ యార్డుకు శలవులు ప్రకటించి ఉండవచ్చునని మిర్చి రైతులు అనుమానిస్తున్నారు.
ఇంత బారీ స్థాయిలో మిర్చి నిలువలు మార్కెట్ కు వచ్చి పడుతున్నప్పుడు వాటిని మద్దతుధరతో కొనుగోళ్ళు చేయడం కష్టమే కావచ్చు. కానీ మార్కెట్ యార్డుకు శలవులు ప్రకటించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని గ్రహించాలి. దాని వలన నిరాశతో ఉన్న మిర్చి రైతులను దళారీలు, వ్యాపారుల చేతికి అప్పగించేసి వారిని దోచుకోవడానికి అనుమతించినట్లవుతుంది. అదే జరిగితే వారు మిర్చి రైతుల కంట్లో కారం కొట్టి వారిని దోచుకోవడం ఖాయం. అప్పుడు అప్పుల బాధలు భరించలేక మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు తెరాస సర్కార్ కే చెడ్డపేరు వస్తుంది. అప్పుడు ఈ సమస్యపై ఉద్యమించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం చిక్కుతుంది కనుక తెరాసకు రాజకీయంగా కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.
కనుక ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మిర్చి కొనుగోళ్ళు కొనసాగించలేకపోతే కనీసం గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు మిర్చిని భద్రంగా దాచుకొనేందుకు ప్రతీ గ్రామంలో యుద్ద ప్రాతిపదికన తాత్కాలికంగా ప్లాస్టిక్ పరదాలతో చిన్న చిన్న గోదాములు నిర్మించినా మిర్చి రైతులకు కొంత ఊరట లభిస్తుంది కదా? వరంగల్ లో జరిగిన తెరాస ప్లీనరీ సభకు కేవలం వారం రోజుల వ్యవధిలో విస్తృతమైన ఏర్పాట్లు చేయగలిగినప్పుడు మిర్చి, వరి, కందుల రైతుల కోసం తాత్కాలిక గోదాములు ఏర్పాటు చేయడం అసాధ్యం కాదు కదా?