తెరాస సర్కార్ వ్యూహం బెడిసి కొట్టిందా?

May 15, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో రెండు మూడు నెలల క్రితం హైదరాబాద్ లో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలి జరుగకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగింది కానీ దాని వలన ఆయనకే ప్రజలలో మంచి పేరు, ప్రచారం, సానుభూతి కూడా లభించాయి. బహుశః ఈకారణంగానే ధర్నా చౌక్ పరిరక్షణ కోసం చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు, మేధావులు, ప్రజా సంఘాలు ఏకత్రాటిపైకి వచ్చి ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేశారని చెప్పవచ్చు. 

గత చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తెరాస సర్కార్ ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహంతో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. ఈసారి వారు అడగగానే ఇందిరా పార్క్ లో ధర్నా చేసేందుకు పోలీస్ కమీషనర్ అనుమతించారు. కానీ ఈసారి స్థానికులని ముందు ఉంచి అడ్డుకొనే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. 

పోలీసులే సాధారణ దుస్తులు ధరించి స్థానికులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేయడం, పోలీసులే ధర్నా చౌక్ వద్ద షామియాన, కుర్చీలు వేయించడం ద్వారా ప్రభుత్వమే కుట్ర చేసిందని కాంగ్రెస్, తెదేపా, వామపక్ష నేతలు, ఐద్వా ప్రతినిధులు వాదిస్తున్నారు. 

ఈసారి అన్నీ ముందు ఊహించినట్లే జరిగాయి. ఆ తరువాత యధాప్రకారం అధికార, ప్రతిపక్షాల నేతల పరసర్పవిమర్శల కార్యక్రమం కూడా మొదలైపోయింది. 

ధర్నాకు వచ్చిన వారు శాంతిభద్రతలకు భంగం కలిగించారు కనుక అక్కడి నుంచి ధర్నా చౌక్ ఎత్తివేయాలనే ప్రభుత్వ వాదనకు బలం చేకూరినట్లయింది. రేపు కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం ఈ సంఘటనలను తప్పకుండా ప్రస్తావించవచ్చు. 

అయితే, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ఎదుర్కోవడంలో ఈసారి అనుసరించిన వైఖరి కూడా తెరాస సర్కార్ కు ఇంకా చెడ్డపేరే తెచ్చేదిగా ఉందని చెప్పకతప్పదు. ఒకవేళ ఈ సమస్యను ప్రభుత్వం నిజాయితీగా పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అది చాలా హుందాగా, గౌరవంగా ఉండేది. కానీ ప్రజల చేత ప్రజలను పోట్లాడించే ప్రయత్నం చేయడం వలన ప్రజల దృష్టిలో ఇంకా పలుచనయింది. పోలీసు అధికారులనో లేదా ఐ.ఏ.ఎస్.అధికారులనో లేదా మరొకరిని మధ్యవర్తిగా ఏర్పాటుచేసి ఇరువర్గాల మద్య చర్యలు జరిగేలా చేసి ఉండి ఉంటే, అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇదేవిధంగా స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడి ఉండి ఉంటే అప్పుడు తెరాస సర్కార్ ను ఎవరూ వేలెత్తి చూపగలిగేవారు. కోర్టు కూడా ప్రతిపక్షాలనే తప్పు పట్టి ఉండేది. 

కానీ తెరాస సర్కార్ ఈరోజు విచిత్రమైన వ్యూహం అనుసరించింది. అది కూడా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు నిజంగానే ధర్నా చౌక్ ను కాపాడుకోవలనే కోరిక ఉన్నట్లయితే వారు ఈ సమస్యపై రాజకీయ మైలేజీ పొందాలని ప్రయత్నించే బదులు స్థానికులతో చర్చించి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం లభించేది కదా!               



Related Post