ఇదేంది సర్కార్?

May 15, 2017


img

“తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రం. ఆర్ధికంగా చాలా బలంగా ఉంది. అందుకే ఆర్ధిక సంస్థలు రాష్ట్రానికి బారీగా అప్పులు ఇచ్చేందుకు క్యూలు కడుతున్నాయి. అందుకే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తరలివస్తున్నాయి. వాటి కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా ఇంకా బలపడుతోంది. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో దూసుకుపోతూ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.” ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు గల్లీ స్థాయి తెరాస నేత వరకు నిత్యం వల్లించే ఈ మాటలు బహుశః అందరూ వినే ఉంటారు.

కానీ నాణేనికి మరోవైపు చూసినట్లయితే అనేక చేదు నిజాలు కన్పిస్తాయి. వాటిని తెలంగాణా శ్రేయోభిలాషులు జీర్ణించుకోవడం కష్టమే. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి హైదరాబాద్ నగరంలోని అత్యంత విలువైన భూములను త్వరలో వేలం వేయబోతోంది. నగరం సమీపంలోగల రాయదుర్గం, ఖానామెట్ నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ తదితర ముఖ్యమైన  ప్రాంతాలలో 15.43 ఎకరాల ప్రభుత్వ భూములను ఈనెల 18న ఈవేలం పద్ధతిలో టి.ఎస్.ఐ.ఐ.సి.ద్వారా వేలం వేయబోతోంది. 

అయితే భూములను వేలం వేయడం ఇదే మొదటిసారి కాదు కనుక బహుశః ఇదే చివరిసారి కాకపోవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస సర్కార్ ఇప్పటి వరకు మూడుసార్లు ఈవిధంగా విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసి సుమారు రూ.2,000 కోట్లు ఆదాయం సమకూర్చుకొంది. ఈసారి వేలంలో రూ.585 కోట్లు ఆదాయం పొందాలని భావిస్తోంది.

తెరాస సర్కార్ విక్రయించబోతున్న భూముల వివరాలు: రాయదుర్గంలోని సర్వే నెంబరు 83/1 లోగల నాలెడ్జ్‌ సిటీ సమీపంలో వరుసగా 2.84 ఎకరాలు, 2.14 ఎకరాలు, 1.57 ఎకరాలను గజం  రూ.60,500 (కనీస ధర) చొప్పున నిర్ణయించింది. అదేవిధంగా ఖానామెట్ వద్ద సర్వే నంబరు 41/14లోని 2.94 ఎకరాలు, 3.02 ఎకరాలు, 2.92 ఎకరాలను గజం రూ.80,000 చొప్పున నిర్ణయించింది.  

భవిష్యత్ అవసరాలకు కాపాడుకోవలసిన ప్రభుత్వ భూములను తాత్కాలిక అవసరాల కోసం లేదా కొద్దిపాటి ఆదాయం సమకూర్చుకోవడం కోసం ప్రభుత్వమే స్వయంగా అమ్ముకోవాలనుకోవడం శోచనీయం. దేశంలో తెలంగాణా రెండవ ధనిక రాష్ట్రమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నప్పుడు, కేవలం రూ.585 కోట్లు ఆదాయం సమకూర్చుకోవడం కోసం విలువైన ప్రభుత్వం భూములను ఎందుకు అమ్ముకోవలసి వస్తోంది? అంటే ధనిక రాష్ట్రం అని ఆయన చెపుతున్న మాటలు అబద్దమా? అసలు ఆదాయం కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం సమంజసమేనా? ఇప్పుడు తాత్కాలిక అవసరాల కోసం విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకొంటూపోతే, మున్ముందు ఏదైనా నిర్మించాలంటే అప్పుడు ప్రభుత్వం ఇదే భూములను మూడు నాలుగు రెట్లు ఎక్కువ చెల్లించికొనవలసి వస్తే అప్పుడు దేనిని అమ్ముకొంటుంది?


Related Post