తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెదేపా-భాజపాల సంబంధాల గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
“మేము భాజపాను ప్రేమిస్తుంటే, భాజపా తెరాసను ప్రేకిస్తోంది. మాది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రాష్ట్రంలో భాజపాయే మాకు దూరం జరిగింది తప్ప మేము కాదు. ఇప్పటికీ మేము భాజపాతో స్నేహన్నే కోరుకొంటున్నాము. అవసరమైనప్పుడు దానికి మేము, మాకు వారు మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయితే భాజపా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ మాయలో జీవిస్తున్నారు. అందుకే వారు రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎప్పుడు చూసినా తమ పార్టీ నేతలతో కంటే కేసీఆర్, కేటిఆర్ వెనుకే తిరుగుతుంటారు. తెలంగాణాలో అనేకమంది బలమైన భాజపా నేతలున్నారు. కానీ ఎవరూ కూడా తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడేందుకు ఇష్టపడరు. ఏదో ఒకరోజు తెరాసతో చేతులు కలుపకపోతామా? అని వారందరూ ఆశగా ఎదురుచూస్తుంటారు. కనుక వచ్చే ఎన్నికలలో వారు మాతో కలిసి పోటీ చేస్తారా లేదా? అనేది జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. భాజపాతో మాకు పొత్తులు ఉన్నాయి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నాము. కనుక నేను అమిత్ షాను రహస్యంగా కలువవలసిన అవసరం లేదు. బహిరంగంగానే కలుస్తాను. నేను భాజపాలో చేరబోతున్నానని వస్తున్న వార్తలలో నిజం లేదు. కానీ నేను భాజపాలో ఉన్నా తెదేపాలో ఉన్నా రెండు పార్టీలకు నావలన లాభమే ఉంటుంది తప్ప నష్టం జరుగదు,” అని చెప్పారు.