ధర్నా చౌక్ తరలింపుపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సుమారు రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ తెరాస సర్కార్ పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. ఈరోజు ఇందిరా పార్క్ ను ఆక్రమించుకొని అక్కడ ధర్నా చేస్తామని వారు ప్రకటించినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్వర్యంలో నగరంలో నిరుద్యోగ ర్యాలి నిర్వహించాలనుకొన్నప్పుడు దానిని ప్రభుత్వం అడ్డుకొంది. కానీ ఈరోజు కార్యక్రమానికి పోలీసులు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అనుమతించడంతో వారు ఆశ్చర్యపోయారు. కానీ హటాత్తుగా వాకర్స్ క్లబ్ సభ్యులు నిన్న అక్కడి నుంచి ధర్నా చౌక్ ని తరలించాలని కోరుతూ పోలీసు కమీషనర్ కు వినతి పత్రం ఇవ్వడం, ధర్నా చౌక్ తరలింపుని వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడేందుకు పోలీసుల అనుమతి తీసుకొని వారు కూడా ధర్నా చేస్తుండటంతో తెరాస సర్కార్ వ్యూహం అర్ధమయ్యింది.
ప్రతిపక్షాలను, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేస్తే ప్రభుత్వానికి ఇంకా చెడ్డపేరు వస్తుంది. అదే..వారిని వాకర్స్ క్లబ్ సభ్యుల చేత నిలదీయిస్తే, అప్పుడు వారు వాకర్స్ క్లబ్ సభ్యుల వాదనలను అంగీకరించలేక, అలాగని ఖండించలేక ఇబ్బందిపడతారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నం చేస్తున్నట్లుంది. ఒకవేళ వాకర్స్ క్లబ్ సభ్యులకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు జవాబు చెప్పుకోలేక ఆవేశంలో వారిపై దాడికి ప్రయత్నించినట్లయితే వారికే చెడ్డపేరు వస్తుంది. అప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. తెరాస సర్కార్ ఈవిధంగా వ్యవహరిస్తుందని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. కనుక ఇప్పుడు బంతి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల కోర్టులో ఉన్నట్లే భావించవలసి ఉంటుంది. కనుక ఇప్పుడు అవి ఏవిధంగా వ్యవహరిస్తాయో చూడాలి.