ఖమ్మం ఘటనలో బలి పశువులు?

May 14, 2017


img

ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు దాడి ఘటనలో మొదట స్పందించిన తెరాస నేతలు యార్డుపై దాడి చేసినవారు ప్రతిపక్షాల మనుషులు..వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే పోలీసులు ఆ కోణంలో నుంచే దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కూడా దానిని దృవీకరించి ప్రభుత్వానికి ఆ నివేదికను పంపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ‘అది ఖచ్చితంగా కుట్రే..బాధ్యులను కటినంగా శిక్షిస్తామని’ హెచ్చరించారు. ఆ తరువాతే పోలీసులు రైతులను అరెస్ట్ చేయడం వగైరాలన్నీ జరిగాయి. అంటే తెరాస సర్కార్ ఆదేశాల ప్రకారమే పోలీసులు వ్యవహరించినట్లు స్పష్టం అవుతోంది. 

ఆ దాడికి పాల్పడినవారు మిర్చి రైతులేనని ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ, ఈ సమస్య నుంచి బయటపడటానికి వారిని రౌడీలు, గూండాలు, ప్రతిపక్ష కార్యకర్తలు అని ముద్ర వేసినట్లు అర్ధం అవుతోంది. ఇప్పుడు వారికి పోలీసులు సంకెళ్ళు వేసి కోర్టులో హాజరుపరిచినందుకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొదట పోలీసులను నిందించిన తెరాస నేతలు మళ్ళీ ఇప్పుడు మాట మార్చి “ఆరోజు దాడిలో పాల్గొన్నవారు రౌడీలే కానీ వారు కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోగా, అమాయకులైన మిర్చి రైతులు ఆవేశంతో దాడికి చేస్తూ కెమెరాలకు దొరికిపోయారు. వారిని ప్రోత్సహించినవారే వారు ఆ కేసులలో ఇరుక్కొనేలాగ చేశారు,” అని మరో సరికొత్త వాదన వినిపిస్తున్నారు.

రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం వారిపై కేసులు పెట్టి జైలుకు పంపడం వలన తెరాస సర్కార్ ప్రతిష్ట కొంత మసకబారిందని చెప్పకతప్పదు. రైతుల చేతులకు సంకెళ్ళు వేసి కోర్టులో హాజరుపరిచినందుకు ఇంకా అప్రదిష్టపాలయింది. 

తెరాస నేతలు తమ తప్పును గ్రహించినట్లే ఉన్నారు. కానీ ఇప్పటికీ జరిగిన తప్పును ఒప్పుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకుండా ఈ కేసులో రోజుకొకరకంగా మాట్లాడుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మిర్చి రైతులు..వారిని అరెస్ట్ చేసిన కారణంగా పోలీసులు బలిపశువులుగా మారినట్లు కనిపిస్తోంది. ఇది చాలా బాధాకరం. ఈ వ్యవహరంలో తెరాస సర్కార్ వేస్తున్న తప్పటడుగులు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. అవి వాటిని తెరాస సర్కార్ పై ప్రయోగిస్తుంటే దానిని తెరాస నేతలు కుట్ర అనడం ఎలా ఉందంటే ‘మేము చేస్తే సంసారం ఎదుటవాడు చేస్తే వ్యబిచారం’ అనట్లుంది. కనీసం ఇప్పటికైనా నష్టనివారణ ప్రయత్నాలు చేయకపోతే తెరాస సర్కార్ ప్రతిష్ట ఇంకా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.


Related Post