తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీ త్వరలో

May 09, 2017


img

జూన్ 2న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. చెరుకు సుధాకర్ కన్వీనర్ గా ఏర్పడుతున్న ఆ పార్టీ పేరు "తెలంగాణా ఇంటి పార్టీ". తమ పార్టీ స్థాపనకు ముందే తమ ఆశయాల గురించి ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్రను ప్రారంభించారు.  

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, “పోరాటాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణాలో ఆంద్రా కాంట్రాక్టర్లు, కార్పోరేట్ సంస్థలకే ప్రాధాన్యం లభిస్తోంది తప్ప రాష్ట్రంలో అట్టడుగు వర్గం ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రం మారలేదు. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఒకప్పటి తెరాస లక్షణాలు ఇప్పటి తెరాసకు లేవు. తెరాస సర్కార్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. మన అమరవీరుల ఆశయాలను సాకారం చేసేందుకు, ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొని పనిచేసేందుకు ‘తెలంగాణా ఇంటి పార్టీ’ అవసరమని భావించి దీనిని స్థాపిస్తున్నాము. రాష్ట్రంలో అట్టడుగు వర్గాల ప్రజలు సైతం సుఖంగా జీవించగలిగినప్పుడే మనం బంగారి తెలంగాణా సాధించినట్లు లెక్క,” అని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కంటే తన కుటుంబ సంక్షేమం కోసమే ఎక్కువ ఆలోచిస్తున్నారు. పార్టీ నడపడానికి, ఎన్నికలలో పోటీ చేయడానికి డబ్బు కావాలని బహిరంగంగానే చెపుతున్నారు. గత 6 దశాబ్దాలుగా సాగిన తెలంగాణా ఉద్యమాలలో ఏనాడూ డబ్బు ప్రసక్తి రాలేదు. తెరాస ఆవిర్భవించినప్పుడూ డబ్బు లేదు. కానీ ఇప్పుడు తెరాసకు అన్ని డబ్బు లెక్కలే. దేనినైన ఆ కోణం నుంచే చూస్తుంటుంది. తెలంగాణా కోసం పోరాడిన వారిలో కొంతమంది వేరే గత్యంతరం లేకపోవడం వలన ఆత్మాభిమానం చంపుకొని తెరాసలో కొనసాగుతున్నారు. ఇక తెలంగాణా కోసం కొట్లాడిన జెఎసి నేతలు ఇప్పుడు ఎవరికీ అక్కరలేని వారయిపోయారు. వారు రాజకీయ అనాధలుగా మిగిలిపోయారు. బంగారి తెలంగాణా కోసం కలలు కంటున్నవారందరికీ తెలంగాణా ఇంటి పార్టీ ప్రత్యమ్నాయ రాజకీయ వేదికగామారబోతోంది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం రోజున హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మా పార్టీని అధికారికంగా ప్రారంభిస్తాము. అదేరోజు మా పార్టీ గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేస్తాము,” అని చెప్పారు చెరుకు సుధాకర్.


Related Post