సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 5 ఏళ్ళు జైలు శిక్ష!

May 09, 2017


img

అవును. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్ర, జాతిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ మదన బి లోకూర్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, మరియు జస్టిస్ కురియన్ జోసెప్ లకు 5 ఏళ్ళు కటిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 లక్షల జరిమానా విదించబడింది. కోల్ కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ఎస్. కర్ణన్ వారికి ఈ శిక్షలు విదించారు. దళితుడనైన తనను వారు మానసికంగా వేధిస్తూ, వృత్తిపరంగా తన పట్ల వివక్ష చూపుతున్నందుకు తాను వారికి ఈ శిక్ష వేస్తున్నట్లు జస్టిస్ కర్ణన్ తన 12 పేజీల తీర్పులో పేర్కొన్నారు. 

వేరొక కేసులో సుప్రీంకోర్టును ధిక్కరించినందుకు జస్టిస్ కర్ణన్ ను కోర్టు మందలించింది. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పి ఈ కేసు నుంచి విముక్తి పొందవచ్చని చెప్పింది. ఆలోచించుకోవడానికి ఆయనకు నెల రోజులు సమయం కూడా ఇచ్చింది. కానీ ఆయన క్షమాపణలు చెప్పకపోగా తిరిగి సుప్రీంకోర్టుపై తీవ్ర విమర్శలు చేయడంతో, ఆయన మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పశ్చమ బెంగాల్ డిజిపిని, కోల్ కత నగర కమీషనర్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వారు వైద్య బృందంతో ఆయన ఇంటికి చేరుకోగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. తనకు బలవంతంగా వైద్యపరీక్షలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవలసివస్తుందని హెచ్చరించడంతో వారు వెనుతిరిగారు. సుప్రీంకోర్టు తనను పిచ్చివాడుగా ముద్ర వేసి తన పదవిలో నుంచి తొలగించాలని కుట్ర పన్నుతోందని భావించిన జస్టిస్ కర్ణన్ తన నివాసంలోనే ఈ తీర్పుని ప్రకటించి, దాని ప్రతులను మీడియా ప్రతినిధులకు అందజేయడం విశేషం. 

దానిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ఏడుగురు న్యాయమూర్తులకు విదించిన రూ.5 లక్షల జరిమానాను వసూలు చేసి ఎస్సీ, ఎస్టీ జాతీయ కమీషన్ ఖాతాలో జామా చేయాలని డిల్లీ పోలీస్ కమీషనర్ ను ఆదేశించారు. ఈ కేసులో బాధితుడునైన తనకు వారు రూ.14 కోట్లు చెల్లించాలని, దానిని వారి జీతాలలో నుంచి కోసి తన బ్యాంక్ ఖాతాలో జమ చేయవలసిందిగా జస్టిస్ కర్ణన్ ఆదేశించారు. శిక్షలు విదించబడిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో ఏడుగురు న్యామూర్తులకు వారి పదవులలో కొనసాగే అర్హత లేదు కనుక తక్షణమే రాజీనామాలు ఇచ్చి తప్పుకోవాలని జస్టిస్ కర్ణన్ ఆదేశించారు. 

జస్టిస్ కర్ణన్ వ్యవహరిస్తున్న ఈ తీరు చూస్తుంటే ఆయనకు నిజంగానే మానసిక సమస్యతో బాధపడుతున్నారేమోననే అనుమానం కలుగుతోంది. ఆయన తాజాగా వెలువరించిన ఈ తీర్పు సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉంది కనుక ఇక ఆయనకు ఉద్వాసన, చట్ట ప్రకారం శిక్ష పడటం ఖాయంగానే కనిపిస్తోంది. 


Related Post