పవన్ కళ్యాణ్ తన ప్రతీ ప్రసంగంలో మరిచిపోకుండా చెప్పే మాట ‘దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది’ అని. అయితే ఆయనే స్వయంగా ఉత్తరాది, దక్షిణాది అంటూ వేర్పాటువాదం లేవనెత్తడం, పదేపదే అదే ప్రస్తావన చేస్తుండటం విశేషం. పవన్ చేస్తున్న ఇటువంటి వాదన వలననే దేశ సమగ్రతకు భంగం కలుగవచ్చు.
ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో దక్షిణాదికి చెందిన ఐ.ఏ.ఎస్.అధికారులే ఈ.వో.లుగా నియమింపబడుతున్నారు. కానీ ఈసారి ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడాన్ని తప్పు పడుతూ ఏపి సర్కార్ ని విమర్శించారు.
“ఉత్తరాది ఐ.ఏ.ఎస్.అధికారి తితిదే ఈవోగా బాధ్యతలు చేపట్టడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. కానీ ఉత్తరాదివారు వారణాసి, అమర్ నాథ్, మథుర వంటి పుణ్యక్షేత్రాలలో దక్షిణాది ఐ.ఏ.ఎస్.అధికారులను ఈవోలోగా నియమించగలరా? వారు దక్షిణాదివారిని అంగీకరించలేనప్పుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఎందుకు అనుమతించారు? అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై ఏపి సర్కార్, తెదేపా ప్రజలకు జవాబు చెప్పాలి,” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే మరో మాట ఏమిటంటే తన వలన రాష్ట్రానికి, దేశానికి నష్టం కలుగకూడదని..తన వలన కొత్తగా సమస్యలు ఎదురవకూడదని. కానీ ఆయన చేస్తున్న ఇటువంటి వాదనతో కొత్త సమస్యలు పుట్టుకువచ్చే అవకాశాలున్నాయి. నిజమే..ఉత్తరాది పుణ్యక్షేత్రాలలో దక్షిణాది అధికారులు కనబడరు. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జిల్లా కలెక్టర్లుగా, ఇంకా వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో, కేంద్రప్రభుత్వంలో అనేకమంది దక్షిణాదికి చెందిన ఐ.ఏ.ఎస్.అధికారులు సేవలు అందిస్తున్నారనే సంగతి పవన్ కళ్యాణ్ తెలుసో తెలియదో.
ఉదాహరణకు యూపిలో బులంద్ షహర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ మన తెలంగాణా రాష్ట్రానికి చెందినవారే. ఆమె ధైర్యసాహసాలు, తెగువ గురించి ఇప్పటికే చాలాసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులను తవ్వి తీసి ఆయనను జైలుకు పంపించిన లక్ష్మి నారాయణ తెలుగువాడే. ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొంటున్న ఇటువంటి ఐ.ఎ.ఎస్. అధికారుల జాబితా చాలా పెద్దదే ఉంది. కనుక ఉత్తరాది దేవాలయాలలో దక్షిణాదివారు ఈవోగా నియమింపబడనంత మాత్రాన్న అదేదో ఘోరతప్పిదం అన్నట్లు మాట్లాడటం సరికాదు. ఆ కారణంగా ఉత్తరాదివారిని పక్కనపెట్టాలని చెప్పడం సరికాదు.
అసలు ఐ.ఎస్.ఎస్. ఎంపిక విధానం, నియామకాల గురించి పవన్ కళ్యాణ్ అద్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇటువంటి మాటలు అభిమానులను ఆకట్టుకోగలవేమో కానీ అవి పవన్ కళ్యాణ్ అవగాహనారాహిత్యానికి అద్దం పడుతున్నట్లున్నాయి.