ఒకప్పుడు తెరాస సర్కార్ పై పరోక్ష విమర్శలకే పరిమితంగా ఉండే టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ క్రమంగా దానితో ప్రత్యక్ష యుద్దానికి సై అంటున్నారు. సందర్భంగా ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలోని నిన్న తెలంగాణా విద్యావంతుల వేదిక ప్రధమ వార్షికోత్సవం జరిగింది.
దానిలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, “ధర్నా చౌక్ కోసం ధర్నాలు చేయవలసిరావడం చాలా దురదృష్టకరం. ప్రజా సమస్యల గురించి ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే తెరాస సర్కార్ వైఖరి సరికాదు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను కాక మరెవరిని అడుగుతారు? అప్పుడే వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి పరిష్కరింపబడతాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసేందుకు రాజ్యాంగం ప్రకారం హక్కు కలిగి ఉన్నారు. తెరాస సర్కార్ దానిని నిరాకరించడం సరికాదు. కనుక ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ నుంచి నగర శివార్లకు తరలించాలనే తన నిర్ణయాన్ని అది ఈ నెల 15లోగా ఉపసంహరించుకోవాలి. లేకుంటే మే 15న అందరం కలిసి ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ ను ఆక్రమించుకొందాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ బారీ సంఖ్యలో తరలి రావాలి,” అని ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత అది ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తోందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలం అయ్యిందని అన్నారు. కేంద్రంతో కోట్లాడి సాధించుకొన్న తెలంగాణాలో నేటికీ ఆంధ్రా కాంట్రాక్టర్లు, సంస్థలు, పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యం లభిస్తోందని, తెలంగాణాలో వనరులు తెలంగాణా ప్రజలకే దక్కాలని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులకు తెరాస సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. తెరాస సర్కార్ హయంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. కనుక ఇకనైనా తెరాస సర్కార్ తన వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలు దానికి గట్టిగా బుద్ధి చెపుతారని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
తెలంగాణా కోసం దశాబ్దకాలంపాటు ఏకదాటిగా ఉద్యమాలు చేసిన తెరాసయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ అదే ఇప్పుడు ఎవరూ ఉద్యమాలు చేయకూడదని, ప్రజా సమస్యలపై ఎవరూ తనను ప్రశ్నించకూడదని, తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎవరూ ధర్నాలు చేయడానికి వీలులేదని హుకూం జారీ చేస్తుండటం ఆశ్చర్యమే. ఇటువంటి ఆలోచనలే ప్రతిపక్షాలకు, బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రొఫెసర్ కోదండరామ్, చుక్కా రామయ్య వంటివారు చేస్తున్న ఇటువంటి విమర్శల కారణంగా రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వం పట్ల క్రమంగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని తెరాస అధినేత మరిచిపోకూడదు.