“ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేసిన మన పార్టీ ఇక దక్షిణాది రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రావాలి. దక్షిణాది రాష్ట్రాలలో ప్రవేశానికి తెలంగాణా రాష్ట్రం ప్రవేశద్వారం వంటిది. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో విజయం సాధించి అధికారంలో రావడానికి మనం ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశపెట్టి తెరాస సర్కార్ వారిని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగం ఆమోదించదు. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతున్నా కూడా అది మత రాజకీయాలు చేయడం మానుకోవడం లేదు. దాని వలన కాంగ్రెస్ పార్టీ కనబడకుండాపోతుంది.”
ఈ మాటలు అన్నది కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. ఆదివారం సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశ్యించి ఆయన చెప్పిన మాటలు ఇవి.
భాజపా కూడా ఒక రాజకీయ పార్టీయే కనుక ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి రావాలనుకోవడం సహజమే. అయితే తెలంగాణాలో భాజపాకు బలమెంత? కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు, కవిత, ఈటెల వంటి వాగ్ధాటిగల నేతలను ధీటుగా ఎదుర్కోగల నేతలు భాజపాలో ఎంత మంది ఉన్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీలో బలమైన అభ్యర్దులున్నారా లేరా? అని ఆలోచించుకోకుండా తెలంగాణా నుంచే తమ దక్షిణాది జైత్రయాత్ర ప్రారంభిద్దామని భాజపా కలలుకంటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ తెలంగాణాలో మొదట తెరాసకు బదులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, భాజపా ఈవిధంగా కలలుగన్నా అర్ధం ఉండేది. కానీ ఒకపక్క తెలంగాణాలో ప్రతిపక్షాలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ మరోపక్క పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ తెరాస నానాటికీ బలపడుతున్నప్పుడు దానిని ఓడించగలమని భాజపా నేతలు కలలు కంటుండటం విశేషమే.