తెరాసపై భాజపా యుద్ధం ప్రకటించినట్లేనా?

May 08, 2017


img

ముస్లిం రిజర్వేషన్ బిల్లు విషయంలో భాజపా తెరాస సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెరాస, భాజపాల మద్య మిర్చి మంటలు చెలరేగాయి.

కేంద్రప్రభుత్వం క్వింటాలుకు మిర్చికి రూ.5,000 మద్దతు ధర ప్రకటించిన తరువాత తెరాస నేతలు కేంద్రప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తుండటంతో భాజపా కూడా మిర్చి రైతుల సమస్యలపై తెరాస సర్కార్ తో యుద్ధం ప్రారంభించింది. 

ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కు తగ్గబోమని చాటి చెప్పడానికి అన్నట్లుగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, వరంగల్ భాజపా నేతలతో కలిసి జిల్లాలోని సోమవారం ఎనుమాముల మిర్చి మార్కెట్ యార్డులో రైతులను పరామర్శించేందుకు వెళ్ళబోతున్నారు.

 రైతులను కలిసేందుకు వస్తున్న ప్రతిపక్ష నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొంటున్న సంగతి తెలిసిందే. కనుక భాజపా నేతలను కూడా పోలీసులు అడ్డుకోవచ్చు. అప్పుడు భాజపా నేతలు ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, రైతుల సమస్యలని పట్టించుకోవడం లేదని విమర్శించడం ఖాయం. ఒకవేళ పోలీసులు వారిని అడ్డుకోకున్నా విమర్శించక మానరు. 

మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకొనేందుకే అక్కడికి వెళుతున్నామని భాజపా నేతలు చెప్పుకొన్నప్పటికీ, ఈ మిర్చి మంటల వేడి డిల్లీకి సోకకుండా అడ్డుకొని, వాటిని రాష్ట్ర ప్రభుత్వంవైపు మళ్ళించడం, ఈ విధంగా రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడమే వారి ప్రధానోదేశ్యం అని చెప్పవచ్చు.

మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ది వారికి ఉండి ఉంటే వారు డిల్లీ వెళ్ళి తమ పెద్దలతో మాట్లాడాలి. లేదా నేతలందరూ తమ పరపతిని ఉపయోగించి వ్యాపారులు, ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలతో మాట్లాడి మిర్చి కొనుగోలు చేసేందుకు ఒప్పించవచ్చు. కానీ ఆ రెండు పనులు చేయకుండా మిర్చి రైతులతో మాట్లాడి, తరువాత తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. కనుక మిర్చి రైతుల సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదనే భావించవలసి ఉంటుంది. తెరాస, భాజపాల మద్య జరిగే మిర్చి ఫైట్స్ వలన మిర్చి రైతులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదని వేరే చెప్పనవసరం లేదు. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లు ఉంటుంది.


Related Post