అవి దొరల లక్షణాలే...నా?

May 07, 2017


img

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి దొరలను, నవాబులను తలపిస్తుంటుందని ప్రతిపక్ష నేతలు, మేధావులు అభిప్రాయపడుతుంటారు.

ఆగస్ట్ 15న జెండా ఎగురవేయడానికి గోల్కొండకోటను ఎంచుకోవడం, తన కోసం కోట్లు ఖర్చు పెట్టి రాజమహల్ ను తలపించే ప్రగతి భవన్ ను నిర్మించుకోవడం, సచివాలయానికి రాకుండా తన నివాసానికే మంత్రులను, అధికారులను రప్పించుకొని అక్కడి నుంచే పాలన సాగించడం, రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను, ఉద్యోగ సంఘాల నేతలను, కార్మికులను కూడా అక్కడికే రప్పించుకొని వారి చేత జేజేలు పలికించుకోవడం, తన ఈ వ్యవహార శైలిపై, ప్రభుత్వ పని తీరుపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఏమాత్రం సంకోచించకుండా తన గొప్పదనం గురించి డప్పు వేయించుకోవడం, పాలాభిషేకాలు వగైరా వగైరాలన్నీ ఆయనలో దొరల లక్షణాలకు అద్దం పడుతున్నాయని ప్రతిపక్ష నేతలు, మేధావులు అభిప్రాయపడుతుంటారు. కానీ ఆ విమర్శలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కేసీఆర్ తనదైన శైలిలోనే ముందుకు సాగుతుండటం విశేషమే.

అందుకు తాజా ఉదాహరణగా ఆశా వర్కర్ల జీతాల పెంపు వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని ఆశా వర్కర్లు విపరీతమైన పని భారంతో సతమతమవుతుంటారు. వైద్య వసతి అందుబాటులో లేని ప్రాంతాలలో వారి సేవలు చాలా అపురూపమైనవి. ప్రజల ఆరోగ్యపరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరోగ్య, సంక్షేమ పధకాల అమలులో వారిదే ప్రధానపాత్ర. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వారు అందిస్తున్న సేవలకు ఎవరూ విలువ కట్టలేరు. కానీ ఇంత కాలంగా ప్రభుత్వం వారికి చెల్లిస్తున్నది నెలకు రూ.1,000-1,500 మాత్రమే. ఆ జీతంతో వారి చేత అంత పని చేయించుకోవడం వెట్టి చాకిరీతో సమానమని సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆరే నిన్న వారితో అన్నారు.

విశేషం ఏమిటంటే, వారు తమ గోడును ప్రభుత్వానికి వెళ్ళబోసుకొని తమ జీతాలు పెంచాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా తెరాస సర్కార్ పట్టించుకోలేదు. ఇక విధిలేని పరిస్థితులలో 2014-15 మద్య కాలంలో ఆశ వర్కర్లు ఏకధాటిగా 100 రోజులు నిరవధిక ధర్నాలు, రకరకాలుగా ఆందోళనలు చేసారు. అయినా అప్పుడు కేసీఆర్ మనసు కరుగలేదు. చివరికి 2015, డిశంబర్ 17న తెరాస సర్కార్ దిగివచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు తమ సమ్మెను విరమించారు. ఇదంతా జరిగి ఏడాదిన్నర గడిచిపోయింది. ఇంతవరకు కూడా వారి జీతాలు పెంచలేదని కేసీఆర్ తాజా ప్రకటనే నిదర్శనం. ఎట్టకేలకు కేసీఆర్ వారిని కరుణించి వారి జీతాలను నెలకు రూ.6,000 చేస్తున్నట్లు ప్రకటించి వారి చేతే జేజేలు పలికించుకొన్నారు.

ఈ ఉదాహరణను గమనిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. ఎవరైనా సరే...తమ డిమాండ్లు నెరవేరాలంటే సమ్మె లేదా ధర్నాలు చేయవలసిందే. దాని వలన ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా సరే..వారితో సర్కార్ మాట్లాడదు. ఈలోగా వారికి మృదువుగా లేదా అవసరమైతే కొంచెం గట్టిగా మందలింపులు కూడా వినవలసి ఉంటుంది. చివరికి వారు సమ్మె చేసి అలసిసొలిసిపోయిన తరువాతనే కేసీఆర్ కరుణిస్తారు. అప్పుడు వారు పది రూపాయలు అడిగితే, కేసీఆర్ వంద రూపాయలు మంజూరు చేస్తారు. దానితో అంతకాలం ఆయనను తిట్టుకొన్నవారే ఆయనకు జేజేలు పలుకుతారు. ఇటువంటి ఉదాహరణలు ఈ మూడేళ్ళలో చాలానే చూశాము.

ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్లో వారి పట్ల చాలా కటినంగా వ్యవహరించినా, తనకు మాత్రమే వారిపై ప్రగాడమైన ప్రేమాభిమానాలు, మానవతాదృక్పధం ఉన్నాయని, తను మాత్రమే వారిని పట్టించుకొని, ఆదుకోగలననే బలమైన సంకేతాలు బాగానే పంపించగలుగుతున్నారు. కనుక ఇవన్నీ నవాబులు లేదా దొరల లక్షణాలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆశ్చర్యం లేదు. 

అయితే అధికారంలో ఉన్నవారు ఏదో విధంగా ప్రజలలో తమ స్వీయ, ప్రభుత్వ పలుకుబడిని, గౌరవాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నించడం సహజమే. కనుక కేసీఆర్ కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. అంతే కాదు..ఈవిధంగా వ్యవహరిస్తూ ఆయన ఆశించిన ప్రయోజనాన్ని నూటికి నూరు శాతం పొందుతున్నారని చెప్పవచ్చు. ఈ అభిప్రాయం నిజమో కాదో వచ్చే ఎన్నికలలో తేలిపోతుంది. 


Related Post