అందుకు మా ధన్యవాదాలు..

May 05, 2017


img

ఈ మద్యన ప్రగతి భవన్ కు వచ్చే వివిధ వర్గాల ప్రజల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పుకొనేందుకు వచ్చే వారే ఎక్కువ. తమకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకొన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వరుసగా క్యూలో నిలబడి కేసీఆర్ కు దణ్ణాలు పెడుతున్న దృశ్యాలు తరచూ కనబడుతున్నాయి. కేసీఆర్ ఏవైనా వరాలు ప్రకటిస్తే బయట డప్పులు..ఊరేగింపులు..ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు కూడా షరా మామూలు దృశ్యాలైపోయాయి. వరుసగా జరుగుతున్న  ఇటువంటి పరిణామాలు చూస్తుంటే మేలు పొందిన సబంధిత వర్గాలు ‘కృతజ్ఞతా ప్రకటన’ చేయడం తప్పనిసరి అన్నట్లుంది.

రైతుల తరువాత రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల వంతు వచ్చిందిపుడు. వారి కృతజ్ఞత ప్రకటనకు కారణం విద్యుత్ శాఖలలో పదోన్నతులకు, ఖాళీల భర్తీకి సర్కారువారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అది చూస్తే ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు కల్పించడం మామూలు విషయమేమీ కాదని అది కూడా ఏదో ఘన కార్యమే అన్నట్లుంది.

విద్యుత్ శాఖలో 13,500 ఖాళీలను భర్తీ చేయబోతున్నందుకు, ఆ కారణంగా అనేక మందికి పదోన్నతులు కల్పిస్తునందుకు విద్యుత్ ఉద్యోగులు గురువారం ప్రగతి భవన్ వచ్చి కృతజ్ఞత ప్రకటించి వెళ్ళారు. 

నిజానికి తెరాస అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లక్షన్నరపైగా ఖాళీలను భర్తీ చేస్తామని కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్ళు గడిచినప్పటికీ అందులో సగం ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు. 

విద్యుత్ శాఖలో 24,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తనను కలవడానికి వచ్చిన విద్యుత్ ఉద్యోగులకు చెప్పి చప్పట్లు కొట్టించుకొన్నారు. తెరాస సర్కార్ ఆ పని నిజంగా చేయగలిగితే అందరికీ సంతోషమే..అందరికీ మేలు జరుగుతుంది కూడా. కానీ సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు ఏ గతి పట్టిందో చూసిన తరువాత విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్న మాటలు ఆచరణ సాధ్యమేనా? అనే అనుమానం కలుగుతోంది. 


Related Post