జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదోపిడీలు..దేనికి సూచన?

May 04, 2017


img

ఇంతకాలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు సైనికులపై, వారి వాహనాలు, స్థావరాలపై దొంగచాటుగా దాడులు చేయడానికే పరిమితం అయ్యేవారు. కానీ నిధుల కొరత ఏర్పడటంతో వారు ఇప్పుడు వరుసగా బ్యాంక్ దోపిడీలు చేస్తున్నారు.

ఈనెల 1న జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ వాహనంపై దాడి చేసి దానికి కాపలాగ ఉన్న ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంక్ సిబ్బందిని కాల్చి చంపి వ్యానులో ఉన్న నగదును, పోలీసుల ఆయుధాలను ఉగ్రవాదులు ఎత్తుకుపోయారు. మళ్ళీ మొన్న మంగళవారం యురిపోర అనే ప్రాంతంలో బ్యాంక్ పై దాడి చేసి సుమారు రూ.65,000 ఎత్తుకు పోయారు. నిన్న బుదవారం పుల్వామా జిల్లాలోని కాకపోర, వాహిబాగ్ అనే వేర్వేరు ప్రాంతాలలో రెండు గంటల వ్యవధిలో రెండు బ్యాంకులపై దాడి చేసి మొత్తం రూ.8 లక్షలు నగదు ఎత్తుకుపోయారు.

గత రెండు సంవత్సరాలుగా కాశ్మీర్ లో పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉండటం చేత అనేక దుఖాణాలు, హోటల్స్ వంటివి మూతపడ్డాయి. ఆ కారణంగా చాలా మందికి ఉద్యోగం, ఉపాధి లేకుండా పోయింది. అటువంటివారిని వేర్పాటువాదులు చేరదీసి పోలీసులు, భద్రతాసిబ్బందిపై రాళ్ళు రువ్వేందుకు ఒక్కొకరికీ నెలకు రూ.7-8,000 చొప్పున జీతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు తరువాత వేర్పాటువాదులకి కూడా నగదు కొరత ఎదురవడంతో కొంతకాలంగా కాశ్మీరులో అల్లర్లు తగ్గుముఖం పట్టడం అందరూ చూశారు. ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఈ బ్యాంక్ దోపిడీలను చూస్తుంటే త్వరలో మళ్ళీ వేర్పాటువాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బారీ స్థాయిలో అల్లర్లు సృష్టించడానికి డబ్బు సిద్దం చేసుకొంటున్నారనే అనుమానం కలుగుతోంది.

బ్యాంక్ దోపిడీలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు, వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. కనుక ఉగ్రవాదుల ద్వారా వారికి డబ్బు అందే అవకాశాలుంటాయి. కనుక ఈ దుశ్చర్యలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే గట్టిగా అడ్డుకోకపోతే అగ్నికి వాయువు తోడైనట్లు ఉగ్రవాదులకు వేర్పాటువాదులు..వారికి కాశ్మీర్ యువత తోడయితే అప్పుడు పరిస్థితులు అదుపు చేయడం ఎవరి తరం కాకపోవచ్చు. 


Related Post