ఒకపక్క ప్రభుత్వం ఎన్ని కటిన చర్యలు తీసుకొంటున్నా, ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తున్నా వ్యాపారులు, దళారులు కుమ్మకై మిర్చి, పసుపు ధరలు తగ్గించేసి రైతులను దోచుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉండటం విస్మయం కలిగిస్తుంది. మొన్నటి వరకు నిజామాబాద్ లో క్వింటాలు పసుపు ధర రూ.6,500 ఉండేది. బుధవారం అకస్మాత్తుగా పసుపు ధర క్వింటాలుకు రూ.3,880కు పడిపోయింది. రూ.50-100 లేదా రూ.300-500 ధర తగ్గితే అర్ధం చేసుకోవచ్చు కానీ ఒకేసారి క్వింటాలుకు రూ.2,620 తగ్గిపోవడం రైతులకు దిగ్బ్రాంతి కలిగించింది. అంత ఎందుకు తగ్గింది అంటే సమాధానం లేదు.
రైతులు అప్పులు చేసి తెచ్చి పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి పండించిన పసుపు పండిస్తుంటారనే సంగతి తెలిసిందే. వారితో దళారులు, వ్యాపారులు ఈవిధంగా చెలగాటం ఆడుతుంటే బక్క రైతు గుండె ఆ బాధను తట్టుకోగలదా? అందుకే నిలిచిపోయింది.
జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండ గ్రామానికి చెందిన దాసరి చిన్న గంగారాం (70) అనే పసుపు రైతు మొన్న తను పండించిన పసుపు బస్తాలను వేసుకొని నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చాడు. అప్పటికే అక్కడ చాలా బారీగా పసుపు నిలువలు పేరుకుపోయి ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలా నుంచి రైతులు ట్రాక్టర్లలో పసుపు బస్తాలు తెస్తూనే ఉన్నారు. ఒకేసారి మార్కెట్ కు పసుపు ముంచెత్తడంతో వ్యాపారులు ధరలు తగ్గించేశారు.
ఒకేసారి క్వింటాలుకు రూ.2,620 ధర తగ్గిపోవడంతో మిగిలిన పసుపు రైతులతో బాటు దాసరి చిన్న గంగారాం కూడా చాలా కలత చెందాడు. వారందరూ అక్కడే మార్కెట్ యార్డులో పసుపు బస్తాలు పెట్టుకొని మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకు ఒకరి బాధను మరొకరు పంచుకొంటూ అక్కడే పడుకొన్నారు. అందరూ ఉదయం నిద్ర లేచారు కానీ గంగారాం మాత్రం లేవలేదు. ఆ బాధ, దిగులుతో రాత్రి నిద్రలోనే మరణించాడు.
మన ముంగిట ఏ శుభకార్యం జరిగినా మొదట ఆ రైతు పండించిన పసుపే ఉంటుంది. ఆడవాళ్ళు అమితంగా వాడేది..ఇష్టపడేది పసుపే. నిత్యం మనం తినే ఆహారంలో పసుపు లేనిదే వంట పూర్తవదు. మనందరికీ ఆ పసుపు అందిస్తున్న రైతు గుండె ఆగిపోయింది. ఆ నిరుపేద రైతు ఇల్లాలి ‘పసుపు’ కుంకుమ చెరిగిపోయింది. ప్చ్!