సింగపూర్ సంస్థలు...స్విస్ ఛాలెంజే ముద్దు

May 03, 2017


img

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సింగపూర్ సంస్థల చేత స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే నిర్మించాలని ఏపి సర్కార్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. 

సింగపూర్ కు చెందిన అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్ అనే మూడు సంస్థలు, అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏడిసి) కలిసి ‘అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్’ అనే ఉమ్మడి సంస్థగా ఏర్పడి మూడు దశలలో 15 ఏళ్ళలో అమరావతి నగరాన్ని నిర్మిస్తాయి. 

మొదటి దశలో 651, తరువాత దశలలో 514,521 ఎకరాలలో రాజధానిని నిర్మిస్తాయి. మొదటి దశలో మొత్తం 8.07 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాల నిర్మాణం చేస్తారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అమ్ముతారు. దానిలో వచ్చిన లాభాలను సింగపూర్ కంపెనీలకు 58 శాతం, అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ కు 42 శాతం పంచుకొంటాయి.  

అమరావతి నిర్మాణానికి సింగపూర్ సంస్థలు, ఏడిసి 58:42 నిష్పత్తిలో పెట్టుబడులు పెడతాయి. ఆ ప్రకారం అవి రూ. 306 కోట్లు, రూ.222 కోట్లు పెట్టుబడులు పెడతాయి. కానీ మౌలికవసతుల అభివృద్ధి కోసం ఏడిసి అధనంగా రూ.2118 కోట్లు పెట్టుబడి పెడుతుంది.  

అమరావతి నిర్మాణాని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. చివరికి దానినే ఖాయం చేశారు. 

అమరావతి నిర్మాణానికి ఏపి సర్కార్ భూమి ఇస్తోంది. బారీగా పెట్టుబడి కూడా పెడుతోంది. కానీ సింగపూర్ సంస్థలకే ఎక్కువ శాతం లాభాలు, వాటికి అనుకూలంగానే నియమ నిబందనలు వ్రాసుకోవడం విడ్డూరంగా ఉంది.  

అమరావతి నిర్మాణంలో ఏపి సర్కార్ కి సింగపూర్ సంస్థలకు ఏ విషయంలోనైనా వివాదం ఏర్పడినట్లయితే వాటిని లండన్ కోర్టులో పరిష్కరించుకోవలసి ఉంటుందని ఒప్పందం చేసుకొన్నట్లు తెలుస్తోంది. మరొక రెండేళ్ళలో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైకాపా విజయం సాధించి అధికారంలోకి వచ్చినట్లయితే ఈ ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి భారమైనా, నష్టమైనా..అయిష్టంగానైనా కొనసాగించవలసి ఉంటుంది. లేకుంటే ఏపి సర్కార్ లండన్ కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయకతప్పదు. ఒకవేళ ఎపిలో మళ్ళీ తెదెపా సర్కారే ఏర్పడినా నిర్మాణ సంస్థలతో వివాదాలు వస్తే లండన్ పరిగెత్తక తప్పదు. చాలా దూరదృష్టి కలవాడుగా పేరొందిన చంద్రబాబు నాయుడు మరి ఈవిధంగా ఎందుకు ఒప్పందం చేసుకొన్నారో ఆయనకే తెలియాలి. 


Related Post