ప్రముఖ తెలంగాణా కవి, రచయిత, తెలంగాణా ఉద్యమాలలలో తన కవితలతో ప్రజలలో ఉత్తేజం నింపిన వ్యక్తి నందిని సిద్దారెడ్డి గురించి తెలంగాణాలో తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణా సాహిత్య అకాడమీకి ఆయనను అధ్యక్షుడిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అది తెలంగాణా సాహిత్యానికి జరిగిన పట్టాభిషేకంగానే భావించవచ్చు.
ఆంద్ర పాలనలో తెలంగాణా బాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలు అవహేళనకు, వివక్షకు గురయ్యాయని చెప్పక తప్పదు. ఇక నేటికీ తెలుగు సినిమాలలో తెలంగాణా బాష, యాస కామెడీ కోసం వాడుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతీ జాతికి గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు ఉంటాయి. అలాగే ప్రతీ బాషకు ఒక తీయదనం, గొప్పదనం ఉంటాయి. వాటిని ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా, మెచ్చుకొన్నా అపహాస్యం చేసినా వాటి ఔనత్యాన్ని ఎన్నడూ కోల్పోవు. తెలంగాణా బాష, సంస్కృతీ సంప్రదాయాలు కూడా అలాగే తమ ఔనత్యాన్ని చాటుకొన్నాయి.
మసి పట్టిన ఆ బంగారాన్ని తుడిచి, మెరుగులు దిద్ది ప్రపంచానికి పరిచయం చేసినవారిలో నందిని సిద్దారెడ్డి కూడా ఒకరు. అయన తెలంగాణా ప్రజల జీవితాలను చిత్రీకరిస్తూ ఎన్నో కవితలు, కధలు, వ్యాసాలు రచించారు. ప్రాణహిత, నది పుట్టువడి, ఇక్కడి చెట్లగాలి, భూమి స్వప్నం, ఒక బాధగాదు, సంభాషణ వంటి అనేక కధా, కవితా సంకలనాలు రచించారు. ముఖ్యంగా తెలంగాణా ఏర్పాటు అవసరంగురించి నొక్కి చెప్పేందుకు “నాగేటి చాలల్ల నా తెలంగాణ..నా తెలంగాణ’’అనే ఒక అద్భుతమైన కవితను రచించారు. దానిని ‘పోరు తెలంగాణా’ అనే సినిమాలో పాటగా మలిచారు. ఆ పాటకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది.
నందిని సిద్దారెడ్డి మెదక్ జిల్లాలోని బందారం గ్రామంలో 1955 లో జన్మించారు. సిద్ధిపేటలోనే డిగ్రీ వరకు చదువుకొన్నాక, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. 1981లో ‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎంఫిల్ చేశారు. ఆ తరువాత ఆధునిక కవిత్వం, వాస్తవికత, అదివాస్తవికత అనే అంశాలపై పరిశోధనలు చేసి 1986లో పి.హెచ్.డి పట్టా అందుకొన్నారు. సిద్ధిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేసి 2012లో పదవీ విరమణ చేశారు.
తెలంగాణ రచయితల వేదిక, మంజీరా రచయితల సంఘంను ఏర్పాటు చేసి వాటికి అధ్యక్షుడుగా వ్యవహరించారు. నవ సాహితి, మెదక్ స్టడీ సర్కిల్ ను ఆయనే ఏర్పాటు చేశారు. సోయి, మంజీరా అనే పత్రికలకు ఎడిటర్ గా పనిచేశారు.
నందిని సిద్దారెడ్డి ప్రతిభకు గుర్తింపుగా 1987 లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, 1988లో ప్రతిష్టాత్మకమైన దాశరథి అవార్డు, ఆ తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి విశిష్ట సాహిత్య అవార్డు అందుకొన్నారు. ఇప్పుడు ఆయన సాహిత్య ప్రతిభకు తెలంగాణా సర్కార్ పట్టాభిషేకం చేస్తున్నట్లుగా తెలంగాణా సాహిత్య అకాడమీకి ఆయనను అధ్యక్షుడిగా నియమించింది.
ఇటీవలే ఆయన ఇంటర్వ్యూ “మైతెలంగాణా.కామ్” లో రెండు భాగాలుగా ప్రచురించింది. మూడవ భాగం త్వరలోనే ప్రచురింపబడుతుంది. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణా ప్రజలందరి తరపున మైతెలంగాణా.కామ్ శుభాభినందనలు తెలుపుతోంది.