పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై వేటు..అదే కారణమా?

May 03, 2017


img

గత దసరా పండుగ రోజున కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వి.ఎస్. అళగు వర్షిణిపై తెరాస సర్కార్ మంగళవారం సాయంత్రం హటాత్తుగా బదిలీ వేటు వేసింది. ఆమెను బదిలీ చేసినప్పటికీ వేరే చోట పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వాదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి ఆమె బాధ్యతలను స్వీకరించారు. 

పెద్దపల్లి కొత్తజిల్లాగా ఏర్పడినందున, జిల్లా సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ అళగు వర్షిణి నడుం బిగించి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్వయంగా క్షేత్ర పర్యటనలు చేస్తూ, అధికారులతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలను అర్హులైన ప్రజలకు అందజేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకొన్నారు. మొట్ట మొదటిసారిగా ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలలో పూడిక తీయించి ఆయకట్టులో చిట్టచివరి ఎకరానికి కూడా నీళ్ళు అందేలాచేశారు. ఇంకా మహిళ సమస్యల పరిష్కారించడం, జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం వంటి అనేక పనులు ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా చేస్తున్నారు. 

ఆమె బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో చాలా మంచి మార్పులు వచ్చినట్లు అధికారులు, ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు వారానికి ఒకసారి తప్పనిసరిగా మండలాలలో పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చేయడం, వారానికి ఒకసారి ప్రజల నుంచి ఆన్-లైన్ ద్వారా అందిన పిర్యాదులకు కలెక్టర్ స్వయంగా జవాబులిచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 

ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన భూసేకరణ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కూడా ఆమె చాలా సమర్ధంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని గోలివాడలో కాళేశ్వర్‌ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న పంప హౌస్ పనులను స్థానికులు అడ్డుకొంటున్నారు. నిర్వాసిత రైతులు, ఆందోళనకారులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆమె వారితో మాట్లాడేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆమెను బదిలీ చేస్తున్నట్లు సందేశం అందింది. 

ఈ విధంగా ప్రజల మన్ననలు అందుకొంటున్న కలెక్టర్ అళగు వర్షిణిపై అకస్మాత్తుగా నిన్న సాయంత్రం వేటు పడటానికి రాజకీయ ఒత్తిళ్ళే కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆమెపై వేటు పడటానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తనను కలిసేందుకు ఆమె నిన్న అపాయింట్ మెంట్ ఇవ్వడం. పంప్ హౌస్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న నిర్వాసిత రైతులకు మద్దతుగా పోరాడేందుకు వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్, గత కొంత కాలంగా తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు తెరాస సర్కార్ ఆగ్రహించి వేటు వేసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్ ఆమె కార్యాలయానికి వచ్చే సమయానికే ఆమెపై వేటు పడటంతో ఆయనను కలెక్టర్ వర్షిణి కలువలేదు.     

ఆమె బాటలోనే నడుస్తున్న భూపాలపల్లి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లను కూడా రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే బదిలీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పనులను సమర్ధంగా నిర్వహించే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని పదేపదే చెపుతుండటం వింటూనే ఉంటాము. కానీ జిల్లా కలెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వారిని అభినందించి, ప్రోత్సహించి సముచితంగా గౌరవించకపోగా రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఈవిధంగా హటాత్తుగా వారిపై వేటు వేసి అవమానించడం విస్మయం కలిగిస్తుంది. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన చిత్తశుద్ధితో పనిచేసే అధికారుల మానసిక స్థైర్యం దెబ్బతింటుంది.వారిలో పనిపట్ల విరక్తి ఏర్పడే ప్రమాదం ఉంది. దాని వలన రాష్ట్రానికే నష్టం కలుగుతుంది. 


Related Post