అరెస్ట్ అయిన రైతులలో ఆరుగురు తెరాస వాళ్ళే?

May 02, 2017


img

“ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. ఆ దాడి వెనుక తెదేపా, కాంగ్రెస్ ముఠాలున్నాయి. దాడికి పాల్పడినవారిపై కేసులు పెడతాము,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హెచ్చరించడమే కాకుండా, అన్నంత పనీ చేశారు. అయితే అరెస్ట్ అయిన 10 మందిలో ఆరుగురు తెరాస మద్దతుదారులే..ఖచ్చితంగా వారందరూ మిర్చి రైతులేననే విషయం తాజాగా బయటపడింది. 

తాజా సమాచారం ప్రకారం నిన్న ఆరెస్ట్ అయిన వారిలో కల్లూరుకు చెందిన ఇస్లావత్ బాలాజీ తెరాస సభ్యుడు కాగా ఆయన భార్య కల్లూరు గ్రామ తెరాస శాఖ అధ్యక్షురాలు. కారేపల్లి మండలం దుబ్బ తండాకు చెందిన తేజావత్ భావ్ సింగ్, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదినేపల్లి గ్రామానికి చెందిన భూక్య అశోక్, ఏన్కూర్ మండలం సిరిపురం తండాకు చెందిన భూక్య నర్సింహ్మారావు తెరాస సభ్యులే. అందరూ మిర్చి రైతులే. వారు మిర్చి బస్తాల లోడుతో ఖమ్మం మార్కెట్ యార్డ్ చేరుకొన్నాక మిర్చి ధరలు రూ.3,000 కు పడిపోవడంతో మిగిలిన రైతులతో కలిసి వారు కూడా ఆందోళన చేశారు. ఆ సందర్భంగానే వారు మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి చేశారు. 

అరెస్ట్ అయిన మిర్చి రైతుల భార్యా, బిడ్డలు తీవ్ర  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలకు వ్యవసాయం తప్ప మరే రాజకీయాలు తెలియవని, మిర్చి బస్తాలను అమ్ముకొని వస్తామని వెళ్ళిన వారు ఈవిధంగా పోలీస్ కేసులో ఇరుకొని జైలుకు వెళ్ళినట్లు తెలిసి ఏమి చేయాలో పాలుపోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. తెరాస సర్కార్ దయచేసి తమ భర్తలను విడిచిపెట్టాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 

ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి చేసినవారు కాంగ్రెస్, తెదేపా ముఠాలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వారు నిజంగా రైతులే అయితే వారి కాళ్ళు మొక్కుతానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కానీ వారు రైతులు..పైగా తెరాస సభ్యులు కూడా. మరి ఇప్పుడేమి చెపుతారు? 

దీనిని బట్టి ఖమ్మం ఘటనపై ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందినట్లు స్పష్టం అవుతోంది. దాని ఆధారంగా ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వలన ఆ ప్రాంతాల రైతులలో వ్యతిరేకత కూడగట్టుకొన్నట్లు అయ్యింది. మిర్చి రైతుల ఆవేదన, ఆందోళన వారి కష్టాలను అర్ధం చేసుకొని మానవతా దృక్పధంతో స్పందించవలసిన ప్రభుత్వం, తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా ప్రతిపక్షాల దాడిని కాసుకొని ఎదురుదెబ్బ తీయడానికి నిజమైన రైతులను ద్రోహులుగా చిత్రీకరించడం, వారిపై పార్టీల ముద్రలు వేసి రైతులను పార్టీల వారిగా చీల్చడం శోచనీయం. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టడం మంచిది. 


Related Post