తెలంగాణా కాంగ్రెస్ నేతలు భూసేకరణ, పంటలకు గిట్టుబాటు ధరలు, సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు మొదలైన అనేక అంశాలపై తెరాస సర్కార్ తో చాలా గట్టిగా పోరాడుతున్నారు. తమ నిరంతర పోరాటాలతో రాష్ట్రంలో తమ ఉనికిని వారు బాగానే చాటుకోగలుగుతున్నారు. అన్ని అంశాలపై ధాటిగా మాట్లాడుతున్న టీ-కాంగ్రెస్ నేతలు తమ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పోలీస్ శాఖ గురించి చేసిన వ్యాఖ్యలపై నోరు విప్పలేకపోతున్నారు. ఆయన వ్యాఖ్యలను సమర్ధించలేక, ఖండించాలేక అందరూ మౌనం వహిస్తున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న పోరాటాలతో ఇంతవరకు ఇబ్బంది పడుతున్న తెరాసకు వారిపై తిరిగి ఎదురుదాడి చేసేందుకు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మంచి ఆయుధంగా లభించాయి. ఇప్పటికే మంత్రి కేటిఆర్, ఎంపి కవిత వాటిని గట్టిగా ఖండించారు. ఇంకా హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి స్పందించవలసి ఉంది.