రైతన్నా ఎంత కష్టమోచ్చిందే నీకు..

April 29, 2017


img

రైతులు కాలు మీద కాలు వేసుకొని కూర్చొనే రోజు ఇంకా ఎప్పుడు వస్తుందో..అసలు వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం రైతన్నలు పడరాని పాట్లు పడకతప్పడం లేదు. ఒకవైపు వ్యాపారులు, దళారుల దోపిడీ, నకిలీ  విత్తనాలు, నకిలీ పురుగుల మందులు, ఎండలు, నీటి కొరత..ఒకటా రెండా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇవి సరిపోవన్నట్లు ప్రకృతి కూడా బక్కచిక్కిన రైతన్నలపై నిన్న తన ప్రతాపం చూపించింది. 

జనగామ జిల్లాలో నిన్న అనేక ప్రాంతాలలో అకస్మాత్తుగా వర్షం పడింది. దీంతో కల్లాలో, మార్కెట్ యార్డుల వద్ద అమ్మకానికి సిద్దంగా ఉంచిన ధాన్యం తడిసిపోయింది. నెల్లుట్ల గ్రామంలో 100 బస్తాలు, మండల కేంద్రంలో గల ఐకెపి సెంటరులో 600 బస్తాలు, ఇతర ప్రాంతాలలో మరో 200 బస్తాల ధాన్యం వర్షంలో తడిసిపోయాయి.  రఘునాధపల్లి మండలంలో గోవర్ధనగిరి, నిడిగొండ ఐకెపి సెంటర్లలలో కూడా కొంతమేర ధాన్యం తడిసిపోయింది. జనగామ మార్కెట్ నుంచి ధాన్యాన్ని తరలించవలసిన పౌర సరఫరా శాఖ అధికారులు రెండు మూడు రోజులుగా మార్కెట్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో  ధాన్యం బస్తాలు అక్కడే ఉండిపోయాయి. ఈ అకాల వర్షం కారణంగా తాము కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే తమ ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు. కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక భయపడినట్లే ఖమ్మంలో ఈరోజు ఉదయం కొంతసేపు వాన కురవడంతో ఆరుబయట పెట్టుకొన్న మిర్చి బస్తాలు తడిసిపోయాయి. మంచి నాణ్యత గల ఎండుమిర్చికి రూ.3,000 మాత్రమే ధర పలుకుతున్నప్పుడు, ఈ తడిసి రంగు మారిన మిర్చిని అసలు వ్యాపారులు కొంటారా అంటే అనుమానమే. 

పంటలు వేసినప్పుడు ఎంత ప్రార్ధించిన చుక్క వాన కురిపించని వరుణదేవుడు, ఇప్పుడు తమ పంటను రోడ్డు మీద పెట్టుకొని కూర్చొంటే అడగకుండానే వాన కురిపించి తమనోటి కాడ కూడుని ఎందుకు పాడు చేస్తున్నాడో..అని దిగులు పడుతున్నాడు మన రైతన్న. ప్రభుత్వమూ కరుణించదు. అధికారులు కరుణించరు. వ్యాపారులు కరుణించరు. చివరికి ఆ దేవుడికి కూడా రైతన్న అంటే చిన్న చూపే అనిపిస్తుంది. ఇదీ మన రైతన్నన పరిస్థితి! 


Related Post