ఈరోజు ఖమ్మంలోని మార్కెట్ యార్డులో జరిగిన విద్వంసం తెదేపాయే జరిపించిందని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ రావు ఆరోపించడంతో దీనికి రాజకీయ రంగు అంటింది. తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రోద్బలంతోనే ఈ విద్వంసం జరిగిందని ఆరోపించారు. నిన్న వరంగల్ లో జరిగిన తెరాస సభకు లక్షలాది రైతులు తరలిరావడం, వారికి తమ ప్రభుత్వం ఎరువులు, పురుగులు మందులు వగైరా కొనుగోలు చేసేందుకు ఎకరాకు రూ.4,000 చొప్పున ఇస్తామని ప్రకటించడం చూసి ఓర్వలేకనే తెదేపా రైతులను రెచ్చగొట్టి ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. మిర్చి ధరలు నిర్ణయించడం ప్రభుత్వం చేతిలో ఉండదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టే ఉంటుంది. అయినప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మిర్చికి మంచి ధరే ఇస్తున్నాము. ఈ దాడిని మేము ఖండిస్తున్నామని అన్నారు.
తెరాస నేత గట్టు రామచందర్ రావు మాట్లాడుతూ, “రైతు వ్యతిరేకి అయిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడే తెలంగాణాలో తన పార్టీ నేతల చేత ఈ కుట్ర చేయించారు. ఇది రైతాంగంపై తెదేపా చేసిన దాడిగా భావిస్తున్నాము. ఈరోజు జరిగిన విద్వంసం వలన మార్కెట్లో కాంటాకు సిద్దంగా ఉన్న మిర్చి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. మా బహిరంగ సభ విజయవంతం అవడం చూసి ఓర్వలేకనే తెదేపా నేతలు ఈ కుట్రకు పాల్పడ్డారు. ఈ దాడిని మేము ఖండిస్తున్నాము. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుంది,” అని అన్నారు.
గత నెల రోజులుగా దళారులు, వ్యాపారులు మిర్చి రైతులతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. రైతులకు అండగా నిలబడవలసిన మార్కెట్ యార్డ్ అధికారులు, ఉద్యోగులు రైతుల ఘోడు పట్టించుకోకుండా వ్యవహరించారు. ఈరోజు ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి ధర రూ.3,000కు పడిపోయింది. దానితో సహనం కోల్పోయిన మిర్చి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వారు ఇంత విద్వంసం సృష్టించారు. అది వారి ఆవేదనకు, అక్రోశానికి నిదర్శనంగానే చూడాల్సిన తెరాస నేతలు తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి దీనికి రాజకీయరంగు పులమడం చాలా దారుణం.
మిర్చికి గిట్టుబాటు ధర వస్తే రైతులు సంతోషంగా అమ్ముకొని వెళ్ళిపోతారు. కానీ రోజుల తరబడి రైతులు ఖమ్మం మార్కెట్ యార్డు దగ్గర పడిగాపులు కాస్తున్నారంటే అర్ధం ఏమిటి? మిర్చికి గిట్టుబాటు ధర రాకపోవడం, శలవుల కారణంగా మిర్చి కొనుగోళ్ళు నిలిచిపోవడం చేత మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాలన్నీ మిర్చీ బస్తాలతో నిండిపోయి ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తుంటే, తెదేపా ఎమ్మెల్యే కుట్ర పన్నారు.. చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని తెరాస నేతలు ఆరోపించడం శోచనీయం.
మిర్చి రైతుల సమస్య గురించి ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారమే కొనుగోళ్ళు జరుగుతాయని చెపుతూ కాలక్షేపం చేయడం వలననే నేడు రైతుల ఆగ్రహం చవి చూసింది. వరంగల్ సభకు రైతులు స్వచ్చందంగా తరలివచ్చారో లేక తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ట్రాక్టర్లలో జనసమీకరణ చేశారో అందరికీ తెలుసు. ఆ సభను చూసి ప్రతిపక్షాలు అసూయపడుతున్నాయని చెప్పుకోవడం చాల హస్యస్పదంగా ఉంది. రైతులు అందరూ తెరాస పక్షాన్నే ఉన్నప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను మార్కెట్ యార్డులో రైతులను కలవకుండా తెరాస కార్యకర్తలు ఎందుకు అడ్డుకొన్నట్లు?
సమస్య ఉందని తెలిసినప్పుడు దానిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతిపక్షాలు ఎప్పుడూ ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటాయి. అది సహజం కూడా. కనుక వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం కనుగొనడం మంచిది. రైతుల ఆవేదనకు ఈవిధంగా రాజకీయరంగు పులిమి, ప్రతిపక్షాలను నిందిస్తూ తప్పించుకొందామని చూస్తే చివరికి నష్టపోయేది తెరాసయే అని మరిచిపోకూడదు.