అవును ఒక క్వింటాల్ ఎండు మిర్చి ధర బ్లాకులో ఒక బాహుబలి సినిమా టికెట్ కంటే తక్కువే. నేడు ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో ఒక క్వింటాల్ ఎండు మిర్చి రూ.3,000కు పడిపోయింది. కానీ ఈరోజు విడుదలైన బాహుబలి-2 సినిమా టికెట్ బ్లాకులో రూ.3,000 కంటే ఎక్కువకే అమ్ముడుపోతోంది. బాహుబలికి అంత క్రేజ్ ఉన్నందుకు సంతోషించాలో లేక మిర్చి రైతుల దుస్థితి ఇంతగా దిగజారిపోయినందుకు కన్నీళ్ళు కార్చాలో తెలియని పరిస్థితి.
అక్కడ ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద మిర్చి రైతులు తమకు గిట్టుబాటు ధరకోసం 46-47 డిగ్రీల ఎండలో మలమలమాడిపోతూ పడిగాపులు కాస్తుంటే, మరోపక్క జనాలు కూడా ఈ ఎండలో మలమలమాడిపోతూ బాహుబలి టికెట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. అక్కడ రైతులు తమ మనుగడ కోసం బాహుబలులులాగ మార్కెట్ యార్డ్ చైర్మన్ కార్యాలయంపై దడి చేసి పోరాడితే...ఇక్కడ జనాలు టికెట్స్ కోసం క్యూలో చెమటలు కార్చుతూ థియేటర్ల యాజమాన్యాలతో అంతకంటే ఎక్కువగానే పోరాడుతున్నారు పాపం.
బాహుబలి టికెట్ కోసం మరో వందో వెయ్యో అదనంగా చెల్లించడానికైన వారు సిద్దంగా ఉన్నారు కానీ మిర్చి వ్యాపారులు మాత్రం రైతులకు అదనంగా ఒక్క రూపాయి చెల్లించడానికి ఇష్టపడటం లేదు! వీలైతే ఇంకా తగ్గించమని అడుగుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర క్వింటాలుకు రూ.1,000కి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమయితే అక్కడి మిర్చి రైతుల పరిస్థితి ఇంకా దయనీయం అన్నమాట!
సినిమాలో బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆదుకొన్నాడు. ప్రేక్షకులు బాహుబలి నిర్మాతలకు కనకవర్షం కురిపించేస్తూ రాజమౌళికి బ్రహ్మరధం పడుతున్నారు. మరి మిర్చి రైతులను ఆదుకొనేందుకు బాహుబలి ఇంకా ఎప్పుడు వస్తాడో అసలు వస్తాడో రాడో? ప్చ్!