సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను నిలిపివేస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు ఒక వర్గానికి సంతోషం, మరొక వర్గానికి తీరని అవేదన కలిగించాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను నిరుద్యోగులు స్వాగతిస్తుంటే, వాటితో తమ జీవితాలు తారుమారు అయ్యాయని కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఎలా తయారైందంటే విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం అన్నట్లుంది.
దేశంలో 125 కోట్లు మంది జనాభా ఉన్నారు. వారందరికీ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు కల్పించడం సాధ్యమా? అంటే కాదనే అర్ధం అవుతోంది. కనుక ప్రభుత్వమే అందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరుకోవడం లేదా అందరూ ప్రభుత్వోద్యోగాలే కావలనుకోవడం సరికాదు. యువత ప్రభుత్వోద్యోగాలకు పరీక్షలు వ్రాయడం, వాటి కోసం ప్రయత్నించడం, ఉద్యోగాలు ఆశించడం తప్పు కాదు. కానీ తమకు ప్రభుత్వమే తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పించాలనుకోవడం సరికాదు.
ప్రొఫెసర్ కోదండరామ్ వంటి మేధావులు కూడా యువతకు సరైన మార్గదర్శనం చేయకుండా ప్రభుత్వోద్యోగాల భర్తీ చేయాలంటూ పోరాటాలు చేయడం విస్మయం కలిగిస్తుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ చేయడం చాలా అవసరమే..కానీ వాటితోనే యువత భవిష్యత్ ముడిపడి ఉందని చెప్పడం చాలా తప్పు.
ప్రభుత్వం అంటే పరిపాలన కోసం ఏర్పాటు చేసుకొన్న ఒక పెద్ద వ్యవస్థ. అది తన అవసరాలకు తగినన్ని ఉద్యోగాలు భర్తీ చేసుకోగలదు. యువత కోసం ఉపాధి మార్గాలు సృష్టించగలదు. కనుక యువత స్వయం ఉపాధి లేదా ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. వారే స్వయంగా చిన్న సంస్థలను ఏర్పాటు చేసుకొనేందుకు వీలుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారికి అన్ని విధాల సహాకారం అందిస్తున్నాయి కూడా.
ఒక సాధారణ రైతు కూలీ లేదా నిరక్షరాస్యులైన కార్మికులు దేశవిదేశాలకు వెళ్ళి తమ కాళ్ళపై తాము నిలబడి తమ కుటుంబాలను పోషించుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, ఉన్నతవిద్యలు, సాంకేతిక విద్యలు అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై ఆధారపడాలనుకోవడం సరికాదు. ఇంకా ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న యువత ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలను తీసుకొని తమ కాళ్ళపై తాము నిలబడి మరో 10మందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తే వారికీ, వారి వలన దేశానికి కూడా చాల మేలు కలుగుతుంది.
అనేక ఏళ్ళుగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ వయసు మీరిపోతున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, సింగరేణి ఉద్యోగులకు యువత అడ్డుపడకుండా ఉన్నట్లయితే వారు కూడా సంతోషిస్తారు. వారు, వారిపై అధారపడున్న కుటుంబాల జీవితాలు కూడా ఒడ్డున పడతాయి. ఎంతైనా వారు కూడా మనసాటి మనుషులే కదా! వారిపట్ల యువత ఈ మాత్రం కరుణ చూపించలేదా?